ఎన్నికల బరిలో హోరాహోరీ తలపడుతున్న అభ్యర్థులు కొందరు తమ ఓటు తామే వేసుకోలేకపోతున్నారు. సొంత ఊరు ఒక చోట.. పోటీ చేసేది మరో చోట కావటంతో ఈ పరిస్థితి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రిజర్వుడు స్థానాలకు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన నేతలు... సురక్షిత స్థానాల నుంచి పోటీ చేసే ఆలోచనతో సొంత నియోజకవర్గాల హద్దులు దాటిన అభ్యర్థులు.. పునర్విభజనతో పాత స్థానాలు చెల్లాచెదురైన నాయకులకు సొంత ఓటు దూరమైంది. జిల్లాలో హుజూరాబాద్, మంథని, జగిత్యాల మినహా... పది అసెంబ్లీ సెగ్మెంట్లు, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న 31 మంది అభ్యర్థులు సొంతంగా తమకు తాము ఓటు వేసుకోలేక పోతున్నారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు.
కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హన్మకొండలో ఓటు హక్కు ఉంది. బీఎస్పీ అభ్యర్థి బర్ల లక్ష్మణ్‌కు నిజామాబాద్‌లో, బర్ల మల్లేశ్ యాదవ్ (స్వతంత్ర) హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్‌లో ఓటు హక్కు ఉంది. దీంతో పోటీ చేస్తున్న చోట వీరు తమ ఓటు వేసే అవకాశం లేదు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ ఓటు మెట్‌పల్లిలో ఉంది, బీసీ యునెటైడ్ ఫ్రంట్ అభ్యర్ధి వెంకటమల్లయ్యకు కరీంనగర్‌లో ఓటు ఉంది.
ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ స్థానికేతరులే. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్)కు పెద్దపల్లిలో ఓటు ఉంది. అక్కడే పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు గోదావరిఖనిలో, బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్యకు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఓటు ఉంది.
సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మె ల్యే.. టీఆర్‌ఎస్ అభ్యర్ధి కేటీఆర్‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో, అక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆకుల విజయకు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో ఓటు ఉంది.
రామగుండం బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డికి పెద్దపల్లిలో ఓటు హక్కు ఉంది. అదే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరును పోలినట్లుగా పేరున్న స్వతంత్య్ర అభ్యర్థి సోమవరపు సత్యనారాయణకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓటు ఉంది.
వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మవెంకన్నకు, మర్వాడి సుదర్శన్ (బీసీ యునెటైడ్ ఫ్రంట్)కు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కు ఉంది.
కోరుట్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుకు ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ఓటు ఉంది.
చొప్పదండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో ఓటు హక్కు ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి బొడిగె శోభకు శంకరపట్నంలో ఓటు హక్కు ఉంది. బీఎస్పీ అభ్యర్థి జన్ను జయరాజ్‌కు కరీంనగర్‌లో ఓటు ఉంది. ఈ ముగ్గురూ ఇక్కడ ఓటు వేయలేని పరిస్థితి. అదే సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న స్వతంత్య్ర అభ్యర్థులు చెలిమల్ల లక్ష్మీకాంతంకు హైదరాబాద్‌లోని లోయర్‌ట్యాంక్‌బండ్, చేర్ల లక్ష్మణ్‌కు జగిత్యాలలో, జానపట్ల స్వామికి కరీంనగర్ మండలం రేకుర్తిలో, బొల్లం అయిలయ్యకు కరీంనగర్‌లో ఓటు హక్కు ఉంది.
మానకొండూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు సిద్దిపేటలో ఓటు ఉంది. అందెభానుమూర్తి (ఆర్‌పీఐ)కు సైదాపూర్ మండ లం వెంకపల్లిలో, కండె సమ్మయ్య (బీసీ యునెటైడ్ ఫ్రంట్)కు వీణవంక మండలం నర్సింగాపూర్‌లో, స్వతంత్ర అభ్యర్ధులు ఎడ్ల వెంకటయ్య, తిప్పారపు జాన్‌సుమన్‌కు కరీం నగర్ లో, గడ్డం నాగరాజుకు సిరిసిల్లలో ఓటు ఉంది.
హుస్నాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌కు హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో ఓటు హక్కు ఉంది. బుర్ర శ్రీనివాస్ (బీసీ యునెటైడ్ ఫ్రంట్)కు బెజ్జంకి మండలం, దుబ్బాక విష్ణువర్ధన్‌రెడ్డి (స్వతంత్ర)కు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓటు ఉంది.
మా ఓటు మరొకరికి..!
Published Thu, Apr 24 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
Advertisement
Advertisement