జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సీమాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉన్నా.. తన సొంత జిల్లాలో మాత్రం కొంతమేరకైనా పోటీ ఇవ్వగల సత్తా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాలని చూస్తున్నారు.
కులాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల వారికే రఘువీరా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం లేదా పెనుకొండ నుంచి రఘువీరా లేక ఆయన సతీమణి సునీత పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేవలం పార్టీ ఫండ్‌ను దృష్టిలో ఉంచుకొని పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు కాకుండా అంతో ఇంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకోగల వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏ నియోజకవర్గంలోనైనా గట్టి పోటీ ఇచ్చే వారికి మాత్రమే పార్టీ ఫండ్ ఇచ్చే అవకాశం వుందని బహిరంగంగా చెబుతున్నట్లు తెలిసింది.
సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలకు బీసీ వర్గానికి చెందిన వారినే బరిలో దింపాలని యోచిస్తున్నారు. రఘువీరారెడ్డి లేదా ఆయన సతీమణి పెనుకొండ నుంచి పోటీ చేస్తే ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న కేటీ శ్రీధర్‌కు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం పార్లమెంటు స్థానానికి బోయ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆ సామాజిక వర్గం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే రాప్తాడు నియోజకవర్గానికి చెందిన బుక్కచెర్ల నాగరాజుకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అయితే పార్లమెంట్ స్థానానికి బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ముందుకు వస్తే నాగరాజుకు అనంతపురం అసెంబ్లీ స్థానానికి టికెట్ దాదాపు ఖాయమైనట్లు పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం స్థానాలకు ఒక్కొక్క పేరును మాత్రమే అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇక పెనుకొండ, కళ్యాణదుర్గంలో ఏదో ఒక స్థానం నుంచి రఘువీరారెడ్డి లేదా ఆయన సతీమణి సునీత పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు సూచించలేదు.
అధిష్టానానికి పంపిన జాబితా
అనంతపురం - బుక్కచెర్ల నాగరాజు, దాదా గాంధీ, దేవమ్మ
శింగనమల - శంకర్, పసులూరు ఓబిళేసు, లక్ష్మినారాయణ, సదానందం
ఉరవకొండ - జగన్‌మోహన్‌రెడ్డి, గుర్రం చెన్నకేశవులు
రాయదుర్గం - వడ్డె చిన్న, అలివేలు శ్రీనివాస్
(వడ్డే చిన్న పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది)
తాడిపత్రి - బోడాల పద్మావతి లేదా చల్లా సుబ్బరాయుడు కుటుంబంలో ఒకరికి అవకాశం
గుంతకల్లు - పూల రమణ, తిమ్మప్ప (వీరిలో పూల రమణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుంది)
హిందూపురం - ఇనయతుల్లా
రాప్తాడు - న్యాయవాది నాగిరెడ్డి, చెన్నేకొత్తపల్లి రమణారెడ్డి, కర్రా హనుమంతరెడ్డి
మడకశిర - సుధాకర్
కదిరి - సుబ్బారెడ్డి
పుట్టపర్తి - శ్రీరాంనాయక్, నాగరాజరెడ్డి, కె.రవీందర్, రమణ
ధర్మవరం - రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎజ్జెన్న