ఈ రోజులు మాకొద్దు..రాత్రి కరెంటు చంపేస్తోంది.. | night current kills farmers | Sakshi
Sakshi News home page

ఈ రోజులు మాకొద్దు..రాత్రి కరెంటు చంపేస్తోంది..

Published Thu, Apr 3 2014 1:54 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

ఈ రోజులు మాకొద్దు..రాత్రి కరెంటు చంపేస్తోంది.. - Sakshi

ఈ రోజులు మాకొద్దు..రాత్రి కరెంటు చంపేస్తోంది..

ఏప్రిల్ 1, మంగళవారం, 2014... వేళాపాళా లేని విద్యుత్తు రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. ఎవుసాన్ని నమ్ముకున్న రైతులను కరెంటు తీగలు కబళించాయి. పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన  మెదక్ జిల్లా గజ్వేల్ వుండలం కోవుటిబండకు చెందిన ఉబ్బని రామయ్య ,  కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో నంగని గంగారెడ్డిలు చేలోనే కరెంటు కాటుకు బలయ్యారు. రామయ్య రాత్రి పదకొండు గంటల సమయంలో పగిలిన పైపులైన్‌ను సరిచేస్తుండగా కరెంటు తీగలు తెగి మీద పడడంతో చనిపోయాడు. గంగారెడ్డి కూడా ఇదే కారణంగా చనిపోయాడు. ఇలా రాత్రి కరెంటుకు ఎందరో చనిపోతూనే ఉన్నారు. రాష్ర్టంలో కరెంటు రాకడ..పోకడ పాలక పెద్దల కే కాదు ఆ దేవుడే దిగివచ్చినా చెప్పలేని దుస్థితి ఉంది. వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో రైతులు రేయింబవళ్లు మడిలోనే మకాం పెడుతూ జాగారం చేస్తున్నారు. కాలిన మోటార్లు, ఫ్యూజులు, ట్రాన్స్‌ఫార్మర్లను బాగు చేసుకునే క్రమంలో బలిపీఠం ఎక్కుతున్నారు.
 
 ఎ(వి)లక్షణంబద్దం.. గెలిస్తే మధ్యంతరం
 మిర్యాలగూడ(నల్లగొండ), న్యూస్‌లైన్:  కొందరికి ఎన్నికలు అచ్చిరావు..వురికొందరు ఎన్నికైనా ఫలం దక్కదు. ఆ రెండో కోవకు చెందిన వ్యక్తే వాస్తు శిల్పి బద్ద నర్సింహారెడ్డి (బీఎన్‌రెడ్డి).మిర్యాలగూడ నుంచి ఎంపీగా బీఎన్‌రెడ్డి గెలిచినప్పుడు ఎప్పుడూ ఐదేళ్లకాలం ఎంపీగా కొనసాగలేకపోయారు. గెలిచిన ప్రతిసారీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.పైగా ఆయన గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. మొదటగా 1989లో బీఎన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భీమిరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఎం)పై 34,995 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీపీసింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు స్వల్పకాలంలో పడిపోవడంతో 1991లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. వుళ్లీ భీమిరెడ్డి (సీపీఎం)పై తిరిగి బీఎన్‌రెడ్డి పోటీ చేసినా 8263 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు పీవీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
 
 1996 సాధారణ ఎన్నికల్లో వుళ్లీ బీఎన్‌రెడ్డి పోటీ చేసి మల్లు స్వరాజ్యం (సీపీఎం)పై 43,876 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం 15 రోజులే కొనసాగింది. తరువాత దేవెగౌడ ప్రభుత్వం కొంత కాలానికే కుప్పకూలింది. దీంతో 1998లో వుళ్లీ మధ్యంతర ఎన్నికలొచ్చాయి. అప్పుడు సీపీఎం అభ్యర్థి చెరుపల్లి సీతారాములుపై 14,498 ఓట్ల మెజారిటీతో బీఎన్‌రెడ్డి గెలిచారు. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఒక్క ఏడాదే ఎంపీ పదవిలో ఉన్నారు. 1999 సాధారణ ఎన్నికల్లో ఆయునకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. టిక్కెట్ దక్కించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత సూదిని జైపాల్‌రెడ్డి వరుసగా ఆయన 1999 , 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.
 
 ఎలచ్చన్లు అచ్చినప్పుడే గుర్తుకస్తం
 ఎన్నో ఎలచ్చన్లు అచ్చినై పోయినై.. నాయకులు మారుతుండ్రు.. ఎలచ్చన్లు అచ్చినప్పుడె మేము గుర్తుకొస్తం. ఆ తర్వాత కనిపియ్యరు. నేను చిన్నగున్నప్పుడే మా పెద్దోళ్ల నుంచి ఈ వృత్తి నేర్చుకున్న. అప్పటినుంచి గిప్పటివరకు నా బత్కులో ఏం మార్పులే. జైనథ్ మండలం సాత్నాల దగ్గరున్న తోయగూడ మా ఊరు. పక్కనున్న మారుగూడ కాడ గుడిసె వేసుకొని పనులు జేసేవాడ్ని. అప్పట్లో కాస్తకార్లు సామగ్రి తీసుకొచ్చి పలుగులు, నాగళ్లు, కర్రులు, కొడవళ్లు, గొడ్డళ్లు, బండిగారెలు తయారు చేయించుకునేవాళ్లు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయంటేనే కమ్మరింట్లో సందడి ఉండేది. చేతిల పైసలు కనిపించేవి. గిప్పుడేమో అన్నీ రెడీమేడ్‌గానే దొరుకుతుండబట్టె.
 
 ఊర్లలో పనిముట్లను సర్పతందుకు తీసుకరావడమే తప్పితే తయారు చేయించుకోవడం లేదు. కమ్మరి పనులు నడవక పోవడంతో బతుకుదెరువు కోసం  ఆదిలాబాద్ పట్టణానికి వచ్చినా. ఈడా ఎడైనా ఇండ్ల పనులు నడుస్తుంటే గడ్డపారలు, ఫ్యాన్ కొండ్లు, డాగులు చేయించుకునేందుకు అస్తుంటారు. పొట్ట గడుస్తే మస్తన్నట్లు బతుకు సాగుతుంది. ఇక్కడికచ్చి 23 ఏండ్లైనా ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు. ఎన్నో ఏండ్లసంది బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కలు కరుణించలేదు. వయసులో ఉన్నప్పుడే ఆ రుణం ఇచ్చుంటే వెల్డింగ్ కార్కాన్ పెట్టుకుంటే లాభముండేది. ఎన్నికలప్పుడు అచ్చిన నాయకులకు నా కష్టాలు చెబితే అన్నీ రాసుకున్నరు. ఇల్లన్నరు, లోనన్నరు, పింఛనన్నురు. ఏదీ ఏదీ లే. మాలోంటోళ్ల కష్టాలు పట్టించుకునేటోళ్లే లేరు. ఈ ముసలితనంలో భగవంతుడు ఇచ్చికాడికి ఉన్నదున్నట్టు పని చేసుకుంటూ బతుకుతున్నా.
 -  పులిమామిడి రాములు, దస్నాపూర్, ఆదిలాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement