'అమేథీలో రిగ్గింగ్ జరగలేదు'
అమేథీలో రిగ్గింగ్ జరిగిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలు నిజం కావని, సదరు పోలింగ్ బూత్ లలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అమేథీలోని 2, 26, 32, 38, 108, 110, 111, 117 బూత్ లు సహా మొత్తం 13 చోట్ల రిగ్గింగ్ జరుగుతోందని, బూత్ కాప్చరింగ్ జరిగిందని ఆరోపించింది. రాహుల్ గాంధీ అనేక వాహనాల కాన్వాయ్ లో వెళ్తున్నరని కూడా ఆప్ ఆరోపించింది. అయితే ఇవన్నీ నిరాధారమేనని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజెపి తరఫున నటి స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ లు పోటీ చేస్తున్నారు.