'పాకిస్తాన్' ప్రజలందరూ మోడీ వైపే
పాకిస్తాన్ ప్రజలు ముక్తకంఠంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటున్నారు. తమ ఓటు నరేంద్ర మోడీకేనని వారు ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. 'పాకిస్తాన్ ఓటర్లు నరేంద్ర మోడీని ఓటేయడమేమిటి.. ఇదంతా పచ్చి అబద్ధం' అనుకోకండి. నిజం! పాకిస్తాన్ లోని 250 మంది ప్రజలు, వంద మంది ఓటర్లు తాము మోడీకే ఓటేస్తామంటున్నారు.
అవును... బీహార్ లోని పూర్ణియా జిల్లాలో పాకిస్తాన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వంద ఓట్లున్నాయి. ఈ వందమందీ తాము మోడీకే ఓటేస్తామని చెబుతున్నారు. తమాషా ఏమిటంటే పూర్ణియాలో ఒక్క ముస్లిం ఓటరు కూడా లేడు. అందరూ ఆదివాసులే. దేశ విభజన సమయంలో ఈ ఊళ్లోని ముస్లింలందరూ తూర్పు పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. వెళ్లినవారికి గుర్తుగా మిగిలిన ప్రజలు తమ ఊరికి పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు. అంతే అప్పట్నుంచీ ఈ ఊరు పాకిస్తాన్ అయిపోయింది.
పాకిస్తాన్ లో చదువుకున్న వారు లేరు. అందరూ నిరుపేదలే. రెండేళ్ల క్రితం మాత్రం ఊరి ప్రజలంతా కలిసి ఊరి పేరు మార్చేయాలనుకున్నారు. కానీ అంతలోనే ఊరుకుండిపోయారు. దీంతో పాకిస్తాన్ పేరు పాకిస్తాన్ గానే ఉండిపోయింది. ఇప్పుడీ పాకిస్తానీయులే మోడీకి మద్దతిస్తున్నారు.