కేసీఆర్ కుటుంబంతో చేటు
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
నల్లగొండ, కోరుట్ల, కామారెడ్డి, న్యూస్‌లైన్: ‘కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్న మాటలతో.. తెలంగాణకు నష్టం జరుగుతుంది. వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు. వాక్కు అలంకారం కావాలి.. కానీ అహంకారం కాకూడదు..’ అని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం వల్లే తెలంగాణకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో, కరీంనగర్ జిల్లా కోరుట్ల, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన సభల్లో పవన్ ప్రసంగించారు. ‘కేసీఆర్ మూడేళ్ల తరువాత నిరంతర కరెంటు ఇస్తానంటాడు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనా.. కేసీఆర్ బాధ్యత లేని నాయకుడు కాబట్టే అలా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి చేతి లో తెలంగాణను పెడితే మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుంది..’ అని పవన్ అన్నారు.
టీడీపీ మీద నాకేం ప్రేమ లేదు..
తనకు టీడీపీ అంటే అంత ప్రేమేం లేదని, టీడీపీ పాలనలో రైతుల సమస్యలపై తాను పోరాడానని పవన్ చెప్పారు. అయితే బాబ్లీ ఎత్తును మహారాష్ర్ట ప్రభుత్వం పెంచినపుడు టీడీపీ పోరాటం చేసినందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చానన్నారు. కేసీఆర్ మోడీని సన్నాసి అనడం బాధేసిందని పవన్ చెప్పారు.
పవన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేశారంటూ డిచ్‌పల్లి, నిజామాబాద్‌కు చెందిన న్యాయవాదులు రవికుమార్, మధు దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించి పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రెండో అదనపు జ్యుడిషియల్ కోర్డు డిచ్‌పల్లి పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 153(ఏ), 506 కింద కేసు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ రాధాకృష్ణ చౌహ న్ ఆదేశాల్లో పేర్కొన్నారు.