
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
హైదరాబాద్: పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచింది కిరణ్ సర్కారేనని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడిమెట్లలోని షాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. అధికారపక్షాన్ని కాలర్ పట్టుకుని ప్రశ్నించాల్సిన చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. ఈ ఐదేళ్ల దుర్మార్గ కాంగ్రెస్ పాలనపై ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలపై పోరాడింది జగనన్న మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే జగనన్న ముఖ్యమనుకున్నాడని, పదవులను సైతం లెక్కచేయలేదని అన్నారు. చివరికి జైలుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. వైఎస్‌ఆర్ సీపీకి ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని ఓటర్లకు షర్మిల విజ్ఞప్తి చేశారు.