
వైఎస్సార్ సీపీకి ప్రజల అండ
కందుకూరు, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం వైఎస్సార్ సీపీకి అండగా నిలబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
ఆదివారం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొక్క జంగారెడ్డితో కలిసి మండల పరిధిలోని మురళీనగర్, చిప్పలపల్లి, ధన్నారం, పులిమామిడి, కందుకూరు తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వైఎస్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందని కుటుంబం రాష్ట్రంలో లేదన్నారు.
ఎన్నికల అనంతరం తెలంగాణలో పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయమని చెప్పారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంతో సం బంధంలేని వారు కూడా నేడు ఉద్యమ పార్టీల్లో చేరి రాజకీయ క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాలే పరమావధిగా నేటి నేతల వ్యవహార శైలి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బొక్క జంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు చిన్నగళ్ల యాదగిరి, భాగ్యలక్ష్మి, నిర్మల, సభావత్ విజయ, వడ్ల కనకాచారి, నాయకులు ఎస్.వీరారెడ్డి, చెరుకు శ్రీనివాస్, బొక్క సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, డి.ప్రతాప్‌రెడ్డి, బి.జగన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.