‘సార్వత్రిక’ సమరం ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో శాంతిభద్రతలు ఎక్కడా అదుపు తప్పలేదు. పటిష్ట ప్రణాళికతో జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈవీఎంల మొరాయింపు ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా మారింది. దీనితో కొన్నిచోట్ల పోలింగు ఆలస్యంగా ప్రారంభమైంది.అయితే అధికారుల కృషి మేరకు పోలింగు పెరగడం విశేషం.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో చెదురుమదురు ఘటనలు మాత్రమే అక్కడక్కడ నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 74.34శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కల్వకుర్తిలో 83.87 శాతం, అత్యల్పం కొడంగల్‌లో 65.61 శాతం ఓట్లు పోలయ్యాయి.
షాద్‌నగర్, గద్వాల నియోజకవర్గాల్లోనూ 80శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. 3268 పోలింగ్ బూత్‌లకు గాను 75 చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పదేసి బూత్‌లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 84శాతం మేర పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేసినా 74.34శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు స్వస్థలాలకు రాకపోవడం వల్లే పోలింగ్ శాతం ఆశించిన మేర నమోదు కాలేదని పోలింగ్ సరళి వెల్లడించింది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 73.02శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 78.25శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2009 ఎన్నికల్లో 69శాతం మాత్రమే ఓట్లు పోల్ కాగా, ప్రస్తుతం 5.34శాతం మేర పోలింగ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి అభ్యర్థులు సమకూర్చిన బస్సులు, మినీ వ్యాన్‌లతో పాటు ద్విచక్ర వాహనాలపై ఓటర్లు సొంత ప్రాంతాలకు రావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన కొల్లాపూర్, అచ్చంపేటలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగడంతో గడువు ముగిసిన తర్వాత ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఎండ తీవ్రత మూలంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకే 52.05శాతం ఓటర్లు ఓటు వేసి వెళ్లారు.
పోలీసులు లాఠీలకు పని...
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఇరువర్గాలు ఘర్షణలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని లాఠీలు ఝలిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలకు సంబంధించి ఎనిమిది ఘటనలు చోటు చేసుకోగా, గద్వాల నియోజకవర్గం మల్దకల్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా ఘటనలపై విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గద్వాల కోటలోని పోలింగ్ స్టేషన్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. అభ్యర్థులు డీకే అరుణ (కాంగ్రెస్), కృష్ణమోహన్‌రెడ్డి (టీఆర్‌ఎస్) కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపు చేశారు. కొడంగల్‌లోనూ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆత్మకూరు మండలం గోపన్‌పేటలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొల్లాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య జరిగిన ఘర్షణల్లో కాంగ్రెస్ నాయకుడు గాయపడ్డాడు. ధన్వాడ మండలం మరికల్‌లో పోలీసులు లాఠీ ఝలిపించడంతో ఓ గర్భిణికి దెబ్బలు తగలడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూలు మండలం నాగనూలులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు పోలీసు జీపును అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫరూఖ్‌నగర్ మండలం విట్యాలలో మతి స్థిమితం లేని వ్యక్తితో ఓటు వేయించారని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారికి పాముకాటు
కేశంపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎన్నికల అధికారి ఊషయ్య మంగళవారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఊషయ్యను తొలుత షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. బాలానగర్ మండలం దోన్లెపల్లి మధిర గ్రామం చొక్కంపేటకు చెందిన 300కు పైగా ఓటర్లు మధ్యాహ్నం వరకు పోలింగ్ బహిష్కరించారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తేనే ఓటు వేస్తామంటూ నిరసనకు దిగారు. చివరకు మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు వచ్చే ఎన్నికల్లో స్థానికంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు.
‘తీర్పు’ ఇచ్చేశాం..!
Published Thu, May 1 2014 3:20 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement