పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలి: సీఐఐ
జగన్‌కు సీఐఐ వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ - సీఐఐ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సీఐఐ చైర్మన్ అనిల్ ఈపూరు, సీఐఐ మాజీ అధ్యక్షులు బి.అశోక్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ వనిత దాట్ల, సీఐఐ ప్రతినిధి ఎన్.వినయ్‌కుమార్‌రెడ్డితో కూడిన బృందం శనివారం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేసింది.
జగన్‌తో సమావేశం తరువాత వనిత మీడియాతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో విద్యుత్, విద్య, వ్యవసాయ పరిశ్రమల రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సలహాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమాభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమైందని, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలను నెలకొల్పితే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని సూచించినట్లు అశోక్‌రెడ్డి చెప్పారు. తాము చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. సీఐఐ బృందం వెంట వైఎస్సార్‌సీపీ నేత ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు.