
ఇప్పుడున్నది మోడీ టీడీపీ: జైరాం రమేశ్
అమలాపురం/ఏలూరు, ‘నిజమైన తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీయే. ఇప్పుడున్నది నరేంద్ర మోడీ టీడీపీ. చంద్రబాబు తన పార్టీని మోడీమయం చేశారు’ అని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. బీజేపీ-టీడీపీ కూటమిలో చంద్రబాబుది బి-టీమ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. నరేంద్రమోడీని రాజకీయాల్లో నిచ్చెనలా వాడుకుంటున్నారని కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేశ్ కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు రెండు లేఖలు ఇచ్చారని, విభజన అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ పైనే రుద్దటం సరికాదన్నారు. విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు.