భద్రతా విధులకు పోలీసులు సిద్ధం
నర్సీపట్నం టౌన్/అనకాపల్లి (తుమ్మపాల), న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల భద్రతకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈనెల 7వ తేదీన జరగనున్న పోలింగ్‌కు నర్సీపట్నం సబ్‌డివిజన్, అనకాపల్లి డివిజన్ పోలీసులకు విధుల కేటాయింపు ప్రా రంభమైంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించే ప్రక్రియ సోమవారం నర్సీపట్నం, అనకాపల్లిలో ప్రారంభమయ్యింది.
నర్సీపట్నం సబ్‌డివిజన్ పరిధిలో విధులు నిర్వహించే స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు, ప్రత్యేక దళాలకు సోమవారం సాయంత్రం ఏఎస్పీ విశాల్‌గున్నీ పలు సూచనలు చేశారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్ర శాంత వాతావరణం కల్పించాలని సూచించా రు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయా రూట్లకు ప్రత్యేక వాహనాల్లో సిబ్బందిని తరలించారు. అనకాపల్లి పోలీస్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బందికి ట్రైనీ ఏఎస్‌పీ కల్మేష్ పలు సూచనలు చేశారు. మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో బందోబస్తు సిబ్బందితో సోమవారం సమావేశమయ్యారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బందిని గ్రూపులుగా ఏర్పాటు చేశారు.
మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం ఆయా అధికారులతో కలిసి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్తారని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అంతకుముందు పోలీసులకు కొంతసేపు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ భూషణం నాయుడు, టౌన్ సీఐ జి. చంద్ర, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రెండు రోజులే కీలకం
నక్కపల్లి : ఈ రెండురోజులూ ఎంతో కీలకమని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని నర్సీపట్నం ఏఎస్పీ విశాల్‌గున్ని సూచించారు. సోమవారం నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగదు, మద్యం పంపిణీ చేసే వారిపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఆదేశించారు. పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన మద్యం, నగదు పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందిస్తామని తెలిపారు. నగదు, మద్యంతో ఎవరైనా చిక్కితే సదరు వ్యక్తితోపాటు ఆ వ్యక్తి ఏ అభ్యర్థికి సంబంధించిన వాడైతే అతనిపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌కు విఘాతం కలిగించే యత్నం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.