సామాజిక రక్షణ- సమగ్రాభివృద్ధి
వైఎస్సే శ్వాస... శ్రేయస్సే ధ్యాస
ఉద్యోగాల జాతర
నియామకాలకు వయోపరిమితి పెంపు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందని... తద్వారా ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీ నిలిచిపోయిన విషయాన్ని మేనిఫెస్టోలో పార్టీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా వయోపరిమితిని పెంచుతామని... ఇందుకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు కూడా వయోపరిమితిని పెంచుతామని ప్రకటించింది. అదేవిధంగా అర్హతలను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని హామీనిచ్చింది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన మరిన్ని హామీలు...
1. రాష్ట్రంలో ఎనలేని సేవలు అందిస్తున్న విద్యుత్‌కార్మికుల ప్రయోజనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షిస్తుంది.
2. కాంట్రాక్టు ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం.
3. హెచ్‌ఆర్ విధానంలో కవర్‌కాని బీమా మిత్ర, వీవోఏ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంచుతాం.
4. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను పెంచుతాం. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తాం. పదవీ విరమణ లభించాల్సిన బెనిఫిట్స్‌పై సానుకూలంగా స్పందిస్తాం.
5. హోం గార్డులు, గోపాలమిత్ర జీతాలు పెంచుతాం.
6. క్యాలెండర్ ఏర్పాటు ద్వారా ఏటా ఉద్యోగ నియామకాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేపడతాం.
సగటు కుటుంబానికి సామాజిక రక్షణ...! సమర్థ పాలనతో సమగ్రాభివృద్ధి...! ఎన్నికల హామీలకు ఇవే అంతస్సూత్రాలుగా... ఓ విజన్ డాక్యుమెంట్‌గా... వైఎస్ పాలన స్ఫూర్తి శ్వాసగా... ప్రజా శ్రేయస్సే ధ్యాసగా... వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు పార్శ్వాలుగా రూపొందిన ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన నిర్మాణాత్మక, ఆచరణీయ హామీలు రాష్ట్ర దిశను, దశను మార్చాలనేది పార్టీ సంకల్పం. దీంట్లోని పలు ప్రధాన హామీల అవసరం, ప్రాధాన్యం, వివరణలు ఇలా...
ఆరోగ్యమస్తు
కోలుకునే వరకూ నెలకు రూ.3 వేల సహాయం
పేదలు, వృద్ధులకు ఉచిత కళ్లద్దాలు జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ
మెడికల్ కాలేజీ ఏర్పాటు తక్కువ ధరకు మినరల్‌వాటర్
ప్రజల ఆరోగ్య ధీమాకు తనదీ పూచీ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. ఆపరేషన్ జరిగినా, తీవ్రంగా ఫ్రాక్చర్లకు వైద్యం పొంది పనిచేయలేని స్థితిలో ఉండేవారికి నెలకు రూ. 3 వేల చొప్పున సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. ఆపరేషన్ జరిగిన తర్వాత పనులకు వెళ్లలేని స్థితిలో ఉండే రోగులకు ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3 వేల చొప్పున సహాయం చేస్తామని వివరించింది. పేదలు, వృద్ధులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగించిన 133 వ్యాధులను తిరిగి జాబితాలో చేరుస్తానని స్పష్టం చేసింది. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు తక్కువ ధరకే మినలర్ వాటర్‌ను అందిస్తామని హామీనిచ్చింది.
ప్రజల ఆరోగ్య ధీమాకు ప్రకటించిన మరికొన్ని పథకాలు...
1. 108, 104 పథకాల పునరుద్ధరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం. డాక్టర్ల కొరత లేకుండా చూస్తాం.
2. రాష్ట్ర రాజధానిలోని 17-20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో జిల్లాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అనుసంధానం. రొటేషన్‌పద్ధతిలో స్పెషాలిటీ వైద్యుల్ని ప్రతి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూడటం.
3. ఆరోగ్యశ్రీ జాబితాలోని 938 వ్యాధుల్లో నుంచి కార్పొరేట్ వైద్యం నుంచి 133 వ్యాధులను మళ్లీ జాబితాలో చేర్చి... ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం.
4. బధిరులు, మూగవారికి ప్రత్యేకంగా కాక్లియర్ ఇంప్లాంట్ వైద్యానికి అయ్యే ఖర్చు రీయింబర్స్‌మెంట్.
5. 108 వాహనాలు, సంచార వైద్యశాలలైన 104 వాహనాలను మరింతగా పెంచి ఆరోగ్యసేవల రంగం మరింత బలోపేతం.
6. మధుమేహం, రక్తపోటు వ్యాధులకు 104 వాహనాల ద్వారా ఉచిత పరీక్షలు, చికిత్స.
7. {పతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం.
8. {పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సరిపడా మందులతో పాటు, వైద్యులు, సిబ్బంది ఏర్పాటు.
9. {పాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి అత్యధిక ప్రాధాన్యత.
10. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటు. పీజీ సీట్ల రెట్టింపు.
11. {పతీ గ్రామానికి తక్కువ ధరకే మినరల్‌వాటర్ సరఫరా. నీటి కాలుష్యంతో వచ్చే రోగాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలోను ఆర్వో, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ల ఏర్పాటు.
12. నిర్ణీత వ్యవధుల్లో పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి నూరు శాతం టీకాలు వేసేలా చర్యలు.
అర్చకులకు పింఛను పెంపు
హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తామని పార్టీ ప్రకటించింది. అర్చకులకు, దేవాలయ సిబ్బందికి పనిచేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని పేర్కొంది. ధూపదీప నైవేద్యాల కోసం ప్రస్తుతం నెలకు ఇస్తున్న కనీస మొత్తాన్ని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచుతామని ప్రకటించింది. హిందూ దేవాలయాల విషయంలో గతంలో వైఎస్ అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామని... అర్చకుల పింఛన్ పెంచుతామని హామీనిచ్చింది. ప్రార్థనా మందిరాలు, ఆలయాలకు సరఫరా చేసే విద్యుత్‌కు వాణిజ్య ధరలు కాకుండా గృహ విద్యుత్ ధరలు అమలు చేస్తామని పేర్కొంది.
ఆర్టీసీని ఆదుకుంటాం
తెలుగుదేశం ప్రభుత్వ హ యాంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ అంచులా దాకా తీసుకెళ్లిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఆపదలో ఉన్న ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుం టామని హామీనిచ్చింది. అధికారం లోకి వచ్చిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌కు సిఫార్సులు కోరతామని స్పష్టం చేసింది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా కార్మికులను రెగ్యులర్ పే స్కేళ్లలో నియమిస్తామని ప్రకటించింది.
సిలిండర్‌పై వంద సబ్సిడీ
బియ్యం కోటా 30 కేజీలకు పెంపు పింఛన్ల వయోపరిమితి 60 ఏళ్లకు కుదింపు బీసీలకు 12 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు
అభివృద్ధి- సంక్షేమ పథకాల అమలును కొనసాగిస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా వంటగ్యాసు సిలిండర్‌ఫై వంద రూపాయల సబ్సిడీని భరిస్తామని హామీనిచ్చింది. ఈ విధంగా ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరకే సరఫరా చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వంటగ్యాసు సబ్సిడీ సిలిండరు రూ.441కు లభిస్తోంది. వంద రూపాయల సబ్సిడీ అనంతరం ఇది కేవలం రూ. 331కే లభించనుంది. గతంలో గ్యాసు ధరలను కేంద్రం పెంచిన సమయంలో రూ. 50ల సబ్సిడీని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని తదనంతర ప్రభుత్వాలు ఎత్తేశాయి.
తిరిగి తాము అధికారంలోకి వస్తే వంద రూపాయల సబ్సిడీపై సిలిండర్లను సరఫరా చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. అదేవిధంగా 2009 ఎన్నికల సమయంలో వైఎస్ హామీ ఇచ్చినమేరకు బియ్యం కోటాను ఒక్కొక్కరికీ కిలో రూపాయికే ఆరు కిలోల చొప్పున కార్డుకు 30 కిలోలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బియ్యం కోటా ఒక్కొక్కరికీ కేవలం నాలుగు కిలోలు మాత్రమే ఉంది. వృద్ధుల పింఛను వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని స్పష్టం చేసింది. చేనేత రుణాల మాఫీ, బీసీలకు 12 వేల కోట్లతో సబ్‌ప్లాను వంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఆ వివరాలు...
1. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లకుండా తగిన చర్యలు చేపడతాం. ఎస్సీ, ఎస్టీల్లో భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి ఇచ్చి, సాగునీటి సౌకర్యం కల్పిస్తాం. దళిత క్రిస్టియన్ల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా కేవలం మతమార్పిడి చేసుకున్నారనే ఒకే కారణంతో ఎస్సీ హోదా లభించట్లేదు. వారిని ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. వైఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
2. బీసీల సంక్షేమానికి రూ.12వేల కోట్లతో సబ్‌ప్లాన్ రూపొందిస్తాం. చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.1200 కోట్లు కేటాయిస్తాం. ఆయా సామాజిక వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి చర్యలు చేపడతాం. బలహీన వర్గాల నివాస కాలనీల్లో రోడ్లు, పారిశుధ్య వసతులు, విద్యుత్, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
3. బీసీలతో సమానంగా ఈబీసీల ఆదాయ పరిమితిని 2.5 లక్షలకు పెంచి విద్య, వైద్య పథకాలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.
4. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అరకొరగా చెల్లించి పథకం స్ఫూర్తిని దెబ్బతీశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం.
5. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు విస్తృ తపరిచి ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతాం.
6. కల్లుగీసే సమయంలో చెట్ల మీద నుంచి ప్రమాదవశాత్తూ పడి మరణించిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రూ.3లక్షల వరకు పరిహారం నెల రోజుల్లోనే చెల్లిస్తాం. అంగవైకల్యానికి గురై శాశ్వతంగా వృత్తికి దూరమైతే రూ.1.5 లక్షల పరిహారం చెల్లిస్తాం. తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూర ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం.
చే‘నేతన్న’కు బాసట
1. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తాం. రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వటమే కాకుండా వారికి చేనేత షెడ్డుతో కలిపి ఇల్లు నిర్మించి ఇస్తాం. మరమగ్గాల చేనేత కార్మికులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున కరెంట్ ఇస్తాం. ముడి పదార్థాల మీద సబ్సిడీ పెంచుతాం. జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తాం. తద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, పాఠశాలల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం. ఆర్టిజాన్ కార్డులపై ప్రయోజనాల కల్పన.
2. చేనేత పింఛను వెయ్యి రూపాయలకు పెంచుతాం. వారి జీవన మెరుగుదలకు కావాల్సిన మరికొన్ని చర్యలు చేపట్టడం.
3. బోయ, వాల్మీకి, కొండ కుమ్మరి, వడ్డెర, మత్స్యకారుల్లోని మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం.
4. వృద్ధులు, అనాథల కోసం ప్రతి నియోజకవర్గంలో ఆశ్రమాలు నిర్మిస్తాం. క్రమేపీ వాటిని మండలాలకు విస్తరణ.
5. {పతి గ్రామానికీ మినరల్ వాటర్‌ను నామమాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా నీటి కాలుష్య వ్యాధులను నివారిస్తాం. ప్లాంట్ల నిర్వహణలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత.
బెల్టుషాపుల రద్దు
వెయ్యి జనాభా దాటిన గ్రామాల్లో 10 మంది మహిళా పోలీసులు
మద్యం మహమ్మారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందుకోసం బెల్టు షాపులను రద్దు చేయడంతో పాటు కల్తీ సారా అమ్మకాలను లేకుండా చేస్తామని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని... తద్వారా గ్రామీణ ప్రజలు ఆదాయాన్ని కోల్పోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల మద్యానికి వ్యతిరేకంగా ఒకవైపు ప్రచారాన్ని చేపట్టి అవగాహన కల్పించడంతో పాటు దశలవారీగా మద్యపాన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం కనీసం వెయ్యికి పైగా జనాభా ఉన్న ప్రతి గ్రామలోనూ 10 మంది మహిళా పోలీసులను ఆ గ్రామం నుంచే నియమిస్తామని ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లో మాత్రమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
మేనిఫెస్టో బాగుంది
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేసి ముందుకు వచ్చిన్నట్లు స్పష్టమవుతోంది. పేదల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ ఉండటం శుభ పరిణామం. వై.ఎస్.రాజశేఖర రెడ్డి పేదల అభివృద్ధే ధ్యేయంగా పని చేశాడు. ఆయన ఆశయసాధనకు తనయుడు జగన్ కృషి చేస్తుండడం అభినందనీయం. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టో ఉంది. మహిళలు, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయం. పేదల గురించి ఆలోచించే నాయకులకు ప్రజల అండ ఉంటుందనడంతో సందేహం లేదు.
- భీమగాని యాదగిరి గౌడ్, జనగామ