నవ తెలంగాణ: సామాజిక తెలంగాణ కావాలి. బడుగులకు అధికారంలో వాటా రావాలి. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను ఆధునికీకరించాలి. పారిశ్రామిక విధానం పక్కాగా ఉండాలి. నియంతృత్వ వ్యవసాయ విధానం రావాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుంది..
- ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అంతరంగం
సామాజిక తెలంగాణ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కావాలి. జనాభాలోని దామాషా ప్రకారం అధికారంలో వాటా ఉండాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. లేకుంటే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఉండదు.
- గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌కు ప్రత్యేక విధానం ఉండాలి. భూమి కోల్పోయిన కుటుంబానికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో వెలికితీసిన ఖనిజాలకు అవసరమైన సంబంధిత పరిశ్రమలను అక్కడే ఏర్పాటు చేయాలి.
- గిరిజన మైనింగ్‌లో భూమి కోల్పోయిన వారికి సంబంధిత కంపెనీల్లో లేదా మైనింగ్ లాభాల్లో వాటా ఇవ్వాలి.
- పారిశ్రామిక విధానం పక్కాకా ఉండాలి. తెలంగాణలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు వారు పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు 75 శాతం ప్రభుత్వమే సమకూర్చాలి.
- {పభుత్వ ధనంతో ఏర్పాటైన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించాలి. రిజర్వేషన్లు ఉండాలి.
- కార్పొరేట్ ఆసుపత్రులకు పాలకమండలి ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. కార్పొరేట్ చేతుల్లో ఆసుపత్రులు ఉండకూడదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ గ్రేడ్ ఆసుపత్రులను మోడ్రన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలి.
- కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం చేపట్టాలి. సంబంధిత యాజమాన్యాలకు పరిహారం ఇచ్చి టేక్‌ఓవర్ చేయాలి.
- {పభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలి. నిర్బంధ కంప్యూటర్ విద్యను అమలుచేయాలి.
- నియంత్రిత వ్యవసాయ విధానం ఉండాలి. అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వమే రైతులకు ఉచితంగా ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఉచిత విద్యుత్ అందజేయాలి.
- రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వమే వాటిని కొనాలి.
- {పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి.
- వరంగల్‌లోని ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను పూర్తిచేయాలి.
- ఎలిమినేటి మాధవరెడ్డి సొరంగ మార్గం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి.
- నెట్టెంపాడు, మంజీర, ఉండి ప్రాజెక్టులను ఐదేళ్లలోగా పూర్తిచేయాలి.
- భూపాల్‌పల్లి, మణుగూరు, పాల్వంచల్లో అదనపు విద్యుత్ కేంద్రాలను వచ్చే ఐదేళ్లలో నెలకొల్పాలి. ఈలోగా కొరతను అధిగమించేందుకు జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి సగం ధరకు కేంద్రం విక్రయించాలి.
- పోలవరం డిజైన్‌ను మార్చి సిరీస్ ఆఫ్ ప్రాజెక్టులను నిర్మించాలి.
- హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతను గవర్నర్‌కు రెండేళ్లకే పరిమితం చేయాలి.
- ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను రెండేళ్లకే కుదించాలి.
- ఉమ్మడి ఉద్యోగుల కాలవ్యవధిని రెండేళ్లకే కుదించాలి.
- వచ్చే ఐదేళ్ల వరకు తెలంగాణ సినిమాలకు 75 శాతం సబ్సిడీ ప్రభుత్వమే సమకూర్చాలి. 100 శాతం తెలంగాణలో తీసే సినిమాలకు దీన్ని వర్తింపచేయాలి. అందులో తప్పనిసరిగా 70 స్థానిక ఉద్యోగులు, కళాకారులు ఉండేలా చూడాలి.
జన తెలంగాణ: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి
నవ తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి. ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి. ‘ప్రైవేటు’కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఎంఈఓ పోస్టుల భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. తెలంగాణ వీరయోధుల చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, టీచర్, పరకాల, వరంగల్
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి
నవ తెలంగాణ అభివృద్ధికి అవినీతి, నిరుద్యోగం అడ్డు కారాదు. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం యువతకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. అభివృద్ధికి అవినీతే పెద్ద అవరోధం కాబట్టి దాని నివారణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
- ఎండీ అక్తర్‌పాషా, టీచర్, ఆత్మకూరు,మహబూబ్‌నగర్
సామాజిక, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
చివరి గ్రామం వరకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. ప్రతి రంగంలోను మెరుగైన సంస్కరణలు తేవాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, విద్యుత్ లోటు భర్తీ వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సామాజిక వేత్తలతో కూడిన దార్శనిక ప్రభుత్వం కొలువు తీరాల్సిన అవసరముంది.
- జన్‌పల్లి అమృతరాజు, కొత్తకోట,మహబూబ్‌నగర్ జిల్లా
యువత, బడుగు వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి
నవ తెలంగాణ నిర్మాణంలో యువత, రైతులు, దళితులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతివ్వాలి. సత్వరమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి... ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిరిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి.రైతుల రుణాలు మాఫీ చేయాలి. బలహీన వర్గాలకు భూపంపిణీ చేపట్టాలి. చేనేత పరిశ్రమను ఆదుకోవాలి. ఇందుకోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం.
- చింతకింది మధు,గౌస్‌కొండ గ్రామం, నల్లగొండ జిల్లా
బడుగుల రాజ్యం రావాలి
Published Tue, Apr 1 2014 1:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement