
శ్రవణ్
హైదరాబాద్: టిఆర్ఎస్ పోలిట్బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్, ఆ పార్టీ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో శ్రవణ్ బలంగా వినిపించే వారు. ఈ ఎన్నికల్లో భువనగిరి లేక ముషీరాబాద్‌లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేయాలని ఆయన అనుకున్నారు. అయితే ఆయనకు టిఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు.కేంద్ర మంత్రి జైరామ్ రమేష్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు.
పార్టీలో చేరిన వెంటనే శ్రవణ్‌ను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా పొన్నాల ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా టీఆర్ఎస్ సొమ్ము చేసుకోవాలనుకుంటుందని పొన్నాల అన్నారు. అందుకే శ్రవణ్ లాంటి ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారన్నారు.