తెలుగు తమ్ముళ్లూ మా వాళ్లే !: షర్మిల | TDP leaders always welcome to ysrcp, except Chandrababu naidu: Sharmila | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లూ మా వాళ్లే !: షర్మిల

Published Fri, Apr 18 2014 3:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

TDP leaders always welcome to ysrcp, except Chandrababu naidu: Sharmila

కానీ చంద్రబాబుకు వైఎస్సార్ సీపీలోకి నో ఎంట్రీ
* టీడీపీకి వేరే గతిలేకే చంద్రబాబును నాయకుడిగా ఎన్నుకున్నారు వైఎస్ షర్మిల
* ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏనాడూ ప్రజల్ని పట్టించుకోలేదు
 
సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలుగు తమ్ముళ్లూ.. మాతో కలిసిపోతున్నారా..? రండి.. మీరంతా మా అన్నదమ్ములే. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబుకు మాత్రం నో ఎంట్రీ(ప్రవేశం లేదు)’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. టీడీపీ శ్రేణులనుద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖ లోక్‌సభ స్థానానికి వై.ఎస్.విజయమ్మ గురువారం నామినేషన్ వేశారు.
 
ఈ కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజయమ్మ నామినేషన్ వేసిన అనంతరం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద పార్టీ శ్రేణులనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తుండగా.. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు కూడా వచ్చాయి. దీంతో వారినుద్దేశించి షర్మిల పైవిధంగా స్పందించారు. షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే.. తెలుగు తమ్ముళ్లూ ఒక్క మాటకు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడున్న కాంగ్రెస్ ఓడిపోతే.. పాపం అల్లుడు కదా.. అని ఎన్‌టీఆర్ దయతలచి టీడీపీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు కన్ను ఎన్‌టీఆర్ కుర్చీపై పడింది. అంతే క్షణం ఆలోచించలేదు.
 
సొంత మామ అని కూడా చూడకుండా.. పట్టపగలే.. కళ్లార్పకుండా వెన్నుపోటు పొడిచారు. ఎన్‌టీఆర్‌ను కాళ్లుపట్టి లాగి మరీ కుర్చీ తీసేసుకున్నారు. ఏ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారో.. ఏ పార్టీనైతే ఎన్‌టీఆర్ స్థాపించారో.. అదే పార్టీ నుంచి ఆయన్ని వెలేశారు. మీకు ఎంత గతిలేకపోతే అలాంటి చంద్రబాబును నాయకుడిగా పెట్టుకుంటారు? జగనన్న సీఎం అవుతాడు.. జగనన్న పాలనలో మీరు, మీ కుటుంబాలు కూడా లబ్ధి పొందుతాయి.
 
ఐదేళ్లూ పేదల పక్షాన నిలిచింది జగనన్నే..
సూటిగా అడుగుతున్నా.. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎప్పుడైనా జనం కోసం పోరాడారా? నిద్రలేచిన నుంచి ఎప్పుడూ.. జగన్  జపమే. ప్రజల కోసం పోరాడింది, వారి సమస్యలపై ఉద్యమించింది జగనన్న ఒక్కరే. ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా.. ప్రజల మధ్యనే గడిపారు. పేద విద్యార్థులు, వారి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేశాడు. రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం రోజుల తరబడి నిరాహార దీక్ష చేశాడు జగనన్న.
 
మీ చంద్రబాబుకు అప్పుడైనా బుద్ధొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. (ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా వింటున్న టీడీపీ శ్రేణులనుద్దేశించి) ‘‘మండుటెండనుసైతం లెక్కచే యకుండా తెలుగుతమ్ముళ్లు సైతం మా కోసం ఇంతటి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపుతున్నందుకు మీకు శిరసు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’’ అని అన్నారు.
 
నేడు నల్లగొండలో షర్మిల ప్రచారం
సాక్షిప్రతినిధి, నల్లగొండ:  ఎన్నికల ప్రచారంలో భాగంగా    షర్మిల నల్లగొండ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు.  హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని మూడు సభల్లో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. ఉదయం 10.30గంటలకు నేరేడుచర్ల, మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడలో, సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేటలో సభలలో ఆమె ప్రసంగిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement