సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీకీ గట్టి పట్టున్న మండలం తల్లాడ. చిరకాలంగా ఇది టీడీపీకీ పెట్టని కోటలా ఉంది. తాజాగా.. ఈ ‘కోట’కు బీటలు పడుతున్నాయి.
తల్లాడ, న్యూస్‌లైన్: సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీకీ గట్టి పట్టున్న మండలం తల్లాడ. చిరకాలంగా ఇది టీడీపీకీ పెట్టని కోటలా ఉంది. తాజాగా.. ఈ ‘కోట’కు బీటలు పడుతున్నాయి. పార్టీ ఆవిర్భా వం నుంచి పనిచేస్తున్న నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఒకరొక్కరుగా రాజీనామా చేస్తున్నారు.
పార్టీ మండల నాయకులపట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని, ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుండడాన్ని జీర్ణించుకోలేని పలువురు రాజీనామా బాట పడుతున్నారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక వర్గం వారికే బీ-ఫారం ఇచ్చారని, మరో వర్గానికి అన్యాయం చేశారని వీరు ఆరోపిస్తున్నారు.
సీనియర్ నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుండేటి వీరారెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తల్లాడకు చెందిన గుంటుపల్లి నరసింహారావు కూడా రాజీనామా చేశారు. వీరిద్దరూ తుమ్మల వర్గీయులు.
పినపాక గ్రామానికి చెందిన డీసీ మాజీ చైర్మన్ వజ్రాల రామిరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాళ్లూరి నరసింహారావు, వెంకటాపురం గ్రామానికి చెందిన నేలవెల్లి వీరనరసింహారావు, నూతనకల్ గ్రామానికి చెందిన గణేశుల రవి, తెలగవరం గ్రామానికి చెందిన మువ్వా మురళి, మిట్టపల్లి గ్రామానికి చెందిన తూము వీరభద్రరావు రాజీనామా చేశారు. వీరంతా నామా వర్గీయులు.
తాను వైఎస్‌ఆర్ సీపీలో చేరతానని గణేశుల రవి ప్రకటించారు. మిగిలిన నాయకులు ఏ పార్టీలో చేరేదీ ఇంకా ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే సంబాని చంద్రశేఖర్‌తో చర్చించారని తెలిసింది.
టీడీపీ నాయకులైన వేమిరెడ్డి కృష్ణారెడ్డి(తల్లాడ మాజీ సర్పంచ్), గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, తాళ్ల జోసెఫ్(ఎంపీటీసీ మాజీ సభ్యుడు)... స్థానిక ఎన్నికలకు ముందే రాజీనామా చేసి, వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. వీరిని పార్టీ నేత, పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించి చేర్చుకున్నారు. వీరి చేరికతో మండలంలో వైఎస్‌ఆర్ సీపీ బలం మరింత పెరిగినట్టయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులకన్నా కూడా వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.