ముంచుకోటే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచివరుసగా ఆరుసార్లు గెలుపొందిన యనమల రామకృష్ణుడు 2009లో ఓటమి పాలై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్థిక మంత్రిగా అనేక అత్యున్నత పదవులు నిర్వర్తించినా నియోజకవర్గానికి ఇది చేశానని గొప్పగా చెప్పుకోవడానికి యనమలకు ఏదీ మిగల్లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పదవులు నిర్వర్తించింది రామకృష్ణుడే అయినా వరుసకు సోదరుడైన కృష్ణుడు(ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టు షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు.
అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో తన వ్యతిరేకులను పోలీసు కేసులతో వేధించిన సంఘటనలు అనేకం. ఏ సందర్భంలో, ఏ పని కావాలన్నా కృష్ణుడు అనుగ్రహించందే జరిగేదే కాదనే ఆరోపణలు ఉన్నాయి.తుని నుంచి రామకృష్ణుడు పోటీలో ఉంటే తెరవెనుక చక్రం తిప్పిన కృష్ణుడే ఇప్పుడు స్వయంగా బరిలోకి దిగారు. 2009లో ఓటమి తరువాత రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కృష్ణుడు పోయిన ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిన పలు సామాజికవర్గాలకు చెందిన నాయకులు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు.
చాలా కాలంగా సమయం కోసం కాచుకున్న కొన్ని వర్గాలు కృష్ణుడిని దెబ్బ తీయడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ పరిణామాలతో కృష్ణుడి వర్గం డీలాపడింది. నియోజకవర్గంలో తొండంగి మండలం రామకృష్ణుడికి కంచుకోట. తుని పట్టణం ఏనాడూ టీడీపీకి మద్దతు ఇచ్చిన దాఖలా లేదు. ఇందుకు ఉదాహరణ గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లో మహానేత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపొందడమే. తుని రూరల్, కోటనందూరు మండలాల్లో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టుండేది. ఎటొచ్చీ తొండంగి మండలంలో వచ్చే ఆధిక్యతతోనే రామకృష్ణుడు సునాయాసంగా గెలుస్తూ వచ్చేవారు. అలాంటి తొండంగి మండలంలో గత ఎన్నికల నుంచీ పరిస్థితి మారి ప్రస్తుతం చేయి దాటిపోవడంతో యనమల కోట కుప్పకూలినట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రామకృష్ణుడు అప్పుడప్పుడు ప్రచారం చేసి పోతున్నారే తప్ప నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అన్న మాటున అధికార దుర్వినియోగం..
అన్న ఉన్నత హోదాలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన నిర్వాకాలతో పట్టణంతో పాటు, రూరల్ మండలాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వ్యాపారులు, వివిధ సామాజికవర్గాలకు చెందిన నేతలపై కేసులు పెట్టించిన అధికార దుర్వినియోగం ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. రామకృష్ణుడి కంటే సీనియర్ అయిన కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లె అచ్చియ్యనాయుడు వంటి నాయకులు కృష్ణుడి తీరుతో విసిగి, వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. తుని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రుత్తల తమ్మయ్యదొర కృష్ణుడి విధానాల వల్లే టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ వ్యతిరేకత తొండంగి మండలాన్ని కూడా తాకడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. ఆ మండలంలో ఎ.వి.నగరం, పెరుమాళ్లపురం, కోదాడ, సీతారామపురం, ఎ.కొత్తపల్లి, దానవాయిపేట, ఎర్రయ్యపేట, వేమవరం తదితర పంచాయతీలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితి.
ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. రామకృష్ణుడు పాతికేళ్లకు పైగా ఉన్నతస్థాయిలో ఉన్నా.. సొంత సామాజికవర్గంలోనే ఎవరికీ ఉద్యోగాలు కల్పించకపోవడం, అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, మండలంలో కనీసం జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయించ లేకపోవడం వంటివి మచ్చుకు కొన్ని. కోన ప్రాంతంలో కృష్ణుడి వర్గీయుల పెత్తనం, భూదందాలతో విసుగెత్తిన మత్స్యకారులు గత ఎన్నికల్లోనే నిరసన తెలపగా.. ఈసారి టీడీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో గత ఎన్నికల ఫలితమే తిరిగి తప్పదన్న నిస్పృహ టీడీపీ శ్రేణులను వెన్నాడుతోంది.