
తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే..
తెలంగాణ ప్రాంత అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ప్రజలందరూ టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
- కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం
- సింగరేణి కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు
- డిస్మిస్ కార్మికులందరికి ఉద్యోగాలిప్పిస్తాం
- వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం
- 4వేల మెగావాట్ల బీపీఎల్ పవర్ ప్రాజెక్టు
- 50వేల మందికి ఉద్యోగావకాశాలు
- గోదావరిఖని సభలో కేసీఆర్
గోదావరిఖని, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంత అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ప్రజలందరూ టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన రామగుండం రణభేరి ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యత ఉందని అన్నారు.
1948లో హైదరాబాద్ నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత 1952లో ఎన్నికలు జరిగాయని, అయితే ఆ సమయంలో చేసిన చిన్న తప్పిదం వల్ల తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారని కేసీఆర్ వివరించారు. నాగార్జునసాగర్‌గా పిలవబడుతున్న నందికొండ ప్రాజెక్టుకు మొదట 180 టీఎంసీల నీరు తెలంగాణకు, 60 టీఎంసీల నీరు ఆంధ్రకు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తే ఆనాడున్న తెలంగాణకు చెందిన కొందరు పెద్దలు చేసిన పొరపాటు వల్ల ఆంధ్రకు 132 టీఎంసీలు, తెలంగాణకు 132 టీఎంసీలు కేటాయింపులు చేశారన్నారు.
కానీ నేడు చూస్తే అందులో తెలంగాణకు 50 నుంచి 55 టీఎంసీల నీరే వస్తోందని వివరించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీమాంధ్రుల నుంచి మోసపోకుండా తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ఆయన కోరారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆగమైపోతామని, అనుకున్న పనులు జరగడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, ఇది గత పదేళ్ల కాలంలో ప్రజలంతా చూశారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెలో కోల్పోయిన సమ్మె అడ్వాన్స్‌ను తిరిగి ఇప్పిస్తామని, తెలంగాణ ఉద్యోగులతో సమానంగా స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో కొనసాగిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని, డిస్మిస్‌కు గురైన కార్మికులందరికి ఉద్యోగావకాశాలు తిరిగి కల్పిస్తామని అన్నారు. గోదావరిఖని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, ఎన్టీపీసీలో మాదిరిగా బీపీఎల్ ప్లాంట్‌ను ప్రారంభించి నాలుగు వేల మెగావాట్ల ఆల్ట్రా ప్లాంట్‌ను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి బాల్క సుమన్, రామగుండం అసెంబ్లీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనం హాజరుకావడంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో ఉత్సాహం కనిపించింది.