కె.చంద్రశేఖర రావు
న్యూఢిల్లీః తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. పార్టీలో మెజార్టీ నేతలు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మూడు రోజుల కిందట ఢిల్లీ వచ్చిన కేకే సోమవారం ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మెజార్టీ లోక్సభ స్థానాలు గెలుస్తామని, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, ప్రమాణాలు చేశామని అవన్నీ నిజం కావాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. పార్టీ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో రాజీపడకుండా అందరికీ అభివద్ధి ఫలాలు అందేలా చూస్తామన్నారు.
ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేకే ధర్డ్ ఫ్రంట్‌లోని కీలక నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన కేకే అక్కడ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు కమ్యూనిస్టు నేతలతో కూడా చర్చలు జరిపారని చెబుతున్నారు.