కొమ్ములు మొలవొద్దు
నిరాడంబరంగా ఉండండి టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ క్లాస్
ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ తరగతులు
పార్లమెంటరీ నేతగా కడియం?
హెదరాబాద్: అధికారంలోకి రాగానే ఆర్భాటాలకు పోవద్దని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పార్టీ అధినేత, శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖరరావు హితవు పలికారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్ష భేటీ జరిగింది. ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ సుమారు గంటకు పైగా మాట్లాడారు. వారందించిన సమాచారం ప్రకారం... ఆర్భాటాలకు పోవద్దని సూచించారు. ‘‘ఎమ్మెల్యేగా గెలవగానే కొమ్ములు మొలుస్తయా? ఇప్పటిదాకా ఉన్నట్టే సామాన్యంగనే ఉండాలె. ఆహార్యంలో కూడా మీరేదో ప్రజలకు అతీతులన్నట్టుగా వ్యవహరించొద్దు. ఆర్భాటాలకు పోవొద్దు. సభలు, సమావేశాల్లో పూలదండలు వేసుకోవొద్దు’’ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైతే తీవ్రమైన సమస్యలొస్తాయన్నారు. అదే జరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
‘‘వచ్చే రెండేళ్లు అత్యంత కీలకం. రాజకీయ అవినీతి లేకుండా అప్రమత్తంగా ఉందాం. కులం, మతం, ఆశ్రీత పక్షపాతం వంటివాటిని దగ్గరికి రానీయొద్దు. అధికారంలో ఉండాల్సిన వాళ్లుగా మనం కడుపు, నోరు కట్టుకుని పని చేయాల్సి ఉంది. రాబోయే రెండేళ్లే మన పనితీరుకు గీటురాయిగా ఉంటది’’ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు కూడా కేసీఆర్ వెల్లడించారు. బాధ్యతలు, విధులు, అధికారాలు, వ్యవహరించాల్సిన తీరుపై వివరిస్తామని చెప్పారు. ఇక టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ నేత కడియం శ్రీహరిని ఎన్నుకునే అవకాశముంది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేసే అధికారాన్ని కేసీఆర్‌కే టీఆర్‌ఎస్ ఎంపీలు కట్టబెట్టారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన టీఆర్‌ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు ప్రమాణం చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక ఉభయ సభలకు కలిపి కేకేను, లోక్‌సభకు కడియంను ఎన్నుకోవచ్చని సమాచారం.
కేసీఆర్‌కు శ్రీవారి ఆశీస్సులు
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ నేతృత్వంలో.. వేద పండితులు శనివారం హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. వేద పండితులు ఆశీస్సులు అందజేయగా.. అధికారులు శ్రీవారి పట్టువస్త్రాలతో సత్కరించారు. లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. - తిరుమల, సాక్షి