
ఉద్యమ మహావృక్షానికి చెదలు: కర్నె ప్రభాకర్
పార్టీ టికెట్ దక్కకపోవడంపై కన్నీరుపెట్టిన నేత
హైదరాబాద్: ఉద్యమ మహా వృక్షానికి చెదలు పట్టాయని టీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ నాయకుడు కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మునుగోడు అసెంబ్లీ టికెట్‌ను ఆయన ఆశించిన విషయం తెలిసిందే. తనకు టికెట్ రాకపోవడానికి పార్టీలోని నాయకులే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన ప్రభాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 14 సంవత్సరాలుగా పార్టీకోసం, ఉద్యమం కోసం పనిచేశానని, అయితే తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.
పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయితే పార్టీలో ఉన్న లొసుగులను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మైనంపల్లికి టీఆర్‌ఎస్ కండువా..: మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు శనివారం కేసీఆర్ పార్టీ కండువా కప్పి లాంఛనంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఇంతకు ముందు ఫాం హౌజ్ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను కలసి ఆయన పార్టీలో చేరారు. అయితే తెలంగాణ భవన్‌కు మొదటిసారి రావడంతో.. లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించారు.