ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పట్నం నుంచి పల్లెదాకా.. ఇప్పుడంతా ఎన్నికల సందడే. ఎక్కడ చూసినా గా ముచ్చట్నే. గ్రామాల్లో పరిషత్ ఎన్నికల వేడి పెరుగుతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో అభ్యర్థులు తమ మద్దతుదారులను కూడగట్టే పనిలో పడ్డారు. తమకు అండగా నిలిచే నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో నాయకులు సైతం తమదైన రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. అసలు రాజకీయమంటే ఏంటో.. ఇప్పుడు చూపెడుతున్నారు.
ఆ రాజకీయరంగులు ఎలా ఉంటాయో ఓ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులకు మధ్య జరిగిన సంభాషణల ద్వారా తెలుసుకుందాం..
చిన్నయ్య: అన్నా నమస్తేనే.... పెద్దన్న(పెద్దులు). మన ఊరికెళ్లి నేను ఎంపీటీసీకీ పోటీ సేత్తున్న. ఇగ నువ్వే ముంగట ఉండి నన్ను గెలిపియ్యాల్నే అన్నా. ఎట్ల జేస్తవో.. ఏం జేస్తవో నాకైతే దెల్వదే నన్నైతే గెలిపియ్యాలే.
పెద్దులు: అగో గిదేందిరో..! ఎంపీటీసీకీ నిన్ను నేను గెలిపిచ్చుడెందిరా బై..;
చిన్నయ్య: అవ్ మల్ల గప్పుడు గా సర్పంచ్ ఎలచ్చన్‌ల ఓరి చిన్నోడా నువ్వు పోటీల లేక పోతే నేనే గెలుత్తరా గోంత సప్పుడు సేయ్యకుండా ఉంటే మంచిగుంటదిరా అని సెప్పినవ్ గదనే...
పెద్దులు: ఓరి సిన్నోడా నువ్వు ముందెతై నామినేసన్ ఏయ్‌రా... ఓట్లు ఏసేటి ముంగట సూద్దం...
చిన్నయ్య: అగో గిదేందే గట్లంటవు... ఆరే సిన్నోడా నువ్వు సర్పంచ్‌కు విత్‌డ్రా సేసుకోరా ఎంపీటీసీకి నిన్నే నిలవెట్టి ఖర్సు లేకుండా నేనే గెలిపిత్త అన్నావ్ గన్నె... మర్సిపోయినావే...?
పెద్దులు: అరే సిన్నుగా మర్సి పోలేదురా గిప్పుడే మర్సిపోతాన్‌రా నువ్ సేసిన సేవను నేనే గిట్ల మరిత్తే మీదున్న దేవుడు ఊకుంటాడ్ర...
చిన్నయ్య: గదేనే ఎందుకంటే నువ్ సర్పంచివి గోంత నువ్ సెపితే పబ్లిక్ ఇంటరు. నిన్ను గెలిపిచ్చినట్లే నన్ను కూడా గెలిపిత్తరే అన్నా...
పెద్దులు: నువ్ జెప్పింది పక్కనేరా. నా గొంత పనుంది మల్ల కలుద్దంరా.
(సర్పంచ్ పెద్దులు తన అసిస్టెంట్ నర్సయ్యను ఎంట బెట్టుకుని ఊర్లే నడుస్కుంట బోతుండు. వారికి ప్రత్యర్థి పార్టీ లీడర్ రామయ్య ఎదురైండు..)
రామయ్య: అబ్బ మొక్కవోయిన దేవుడు ఎదురచ్చినట్లు సక్కగా ఎదురచ్చినవే పెద్దులన్న.
పెద్దులు: అగో నన్ను దేవుడిలెక్క గొలుతున్నవ్ ఏందిరా... రామా...?
రామయ్య: మరి ఇంకేందె... నేను పొద్దుగాల్ల సాయబుస్సేన్ హోటల్ కాడ పేపర్ సూసిన్నించి నిన్ను గల్సెతందుకు మత్తు లెంకుతున్న.
పెద్దులు: నేను పొలంకాడికి బోయి పంచాయతీ ఆపీసుల కూసోని అత్తున్న..ఇసయం ఎందో సెప్పు.
రామయ్య: గదేనే ఇగ ఎంపీటీసీకి ఓట్లు ఏసుడు ఉందట గదా.. నేను మా పార్టీ గుర్తు మీద పోటీ సేత్తున్న. నీ సపోర్టు గావాలా. ఎందుకంటే నువ్వు ఒక్కతీర్గ బతిమాలితే నేను సర్పంచ్ ఎలచ్చన్‌ల సప్పుడుదంక ఊకున్న. గీ ఇసయం సెప్పెటందుకు ఊరంత లెంకుంట అచ్చిన.
పెద్దులు: అగో ఏందిరా గమ్మత్ మాట్లాడుతున్నవ్. నేను బతిమిలాడితేనే నువ్వు సర్పంచ్ ఎలచ్చన్‌ల విత్‌డ్రా అయినావురా.! మీ కులపోల్లు నాకు సపోర్టు ఇత్తమని మీటింగ్ పెట్టుకుని ఢంకా బజాయిస్తే నువ్వు విత్ డ్రా అయినవ్.
రామయ్య: అగో గిదేం తరీఖనే... ఓరి రామా నువు గోంత సప్పుడుదాక ఉండురా మీ సంఘపోల్లకు దావాత్ ఇచ్చి నాకు మద్దతు ఇయ్యమంట అంటవి. సంఘం మీటింగ్‌ల నువ్వు పోటీ సేత్త అని సెప్పకుమంటివి గన్నె.
పెద్దులు: ఏ మర్సి పోలేదురా. మజాక్‌ల గట్లన్న గని.. నువ్వు అయితే మీ పార్టీ బీఫాం తీసుకుని రారా. నీకు సపోర్టు సేసుడు సేసుడే.
రామయ్య: మంచిదే పోత మరి పనులు బగ్గ ఉన్నయి.
(పెద్దులు తోవ వెంట పోతుండగా.. లచ్చన్న ఎదురై ఆపిండు..)
లచ్చన్న: నమత్తే సర్పంచ్ సాబ్ నమత్తే.
పెద్దులు: ఏం లచ్చన్న మంచిగున్నవా.. ఇయ్యల్ల ఒకోల్ల ఎనుక ఒకోల్లు గలుతుండ్రు.
లచ్చన్న: ఓల్లు గల్సిండ్రు సర్పంచ్ సాబ్ నేనైతే గిప్పుడే అత్తున్న.
పెద్దులు: ఇగో చిన్నయ్య, రామయ్య గల్సిండ్రు ఎంపీటీసీ ఎలచ్చన్‌ల పోటీ సేత్తుండ్రట సపోర్టు ఇయ్యమని అడిగిండ్రు.
లచ్చన్న: కొంపదీసి మాటిచ్చినవా ఏందే... నేను మోటారు సైకిల్ గుర్తు మీద పోటీ సేత్తున్న గాల్లకు మాట ఇత్తే ఎనకకు తీసుకో.
పెద్దులు: ఏ లేదు లచ్చన్న ఉట్టిగనే ఊ కొట్టినా.. నేను నీకు తప్ప ఇంకోల్లకు సపోర్టు ఎట్ల ఇత్త. నా ఎలచ్చన్‌ల మత్తు పైసలు నువ్వే కర్సు బెడితివి.
లచ్చన్న: గదేనే నేనెతై నీ మీదనే మత్తు నమ్మకం బెట్టుకున్న.
పెద్దులు: ఇగో నేనైతే ఏ పార్టీల లేను. నువ్వు బేఫికర్ మీదు ఉండు. గా మోటార్ సైకిల్ గుర్తుకు ఓటేపిద్దాం. ఇగ వో.
(ముగ్గురితో ఇక్‌మత్‌గా మాట్లాడిన పెద్దులు ఇంట్లోకి అడుగు పెడుతుండగా.. కిష్టయ్య ఉరుక్కుంట దమ్ము బిగబట్టుకొని అచ్చిండు..)
పెద్దులు: ఏం కిట్టన్న ఉరుక్కుంట అచ్చినవ్ గోంత దమ్ము దీసుకోని ఇసయం సెప్పు.
కిష్టయ్య: పెద్దులన్న నువ్వు చిన్నయ్యకు.. రామయ్యకు.. లచ్చన్నకు.. ఎంపీటీసీ ఎలచ్చన్‌ల మద్దతు జేస్తానని సెప్పినవట. మన ఊర్లే ఒక్కటే ఎంపీటీసీ ఉంది గన్నె. మరి నేను నీ మీదనే ఆశపెట్టుకుని ఉన్న. గీ ఇసయం దెల్వంగనే ఆగకుండా అచ్చిన్నే.
పెద్దులు: అగో గా ముగ్గురికి నేను మాట ఇచ్చినని ఓల్లు సెప్పిండ్రు.
కిష్టయ్య: గాల్లే ఒల్ల అంగల ఆల్లు సర్పంచ్ సాబ్ నాకే సపోర్టు సేత్తుండు అంటుండ్రు. నేనైతే నమ్మలేదు. ఏంటికంటే నీ ఎలచ్చన్‌ల మత్తు పని సేసిన గీ ఎంపీటీసీ ఎలచ్చన్‌ల నాకు సపోర్టు సేత్తన్నవ్. మరి గా ఇసయం మర్సినవా ఏంది అని ఉరుక్కుంట అచ్చిన.
పెద్దులు: ఇగో కిష్టయ్య గాళ్ల మాటలు నమ్మకే. నువ్వు పెచారం సేసుకో నేను సెప్పెటోల్లకు సెప్పుతా.. అంటు ఇంట్లకు నడ్సిండు.
(ఇదంతా గమనించిన సర్పంచ్ అసిస్టెంట్ నర్సయ్య ధైర్యం సేసి సర్పంచ్‌ను గీ ఇసయం అడిగిండు.)
నర్సయ్య: అవ్ సర్పంచ్ సాబ్.. నువ్వు అందరికీ సపోర్టు సేత్తనంటివి. మరి ఎన్నికల్ల ఓల్లకు సపోర్టు సేత్తవ్ నాకైతే అర్థం అయితలేదు.
పెద్దులు: ఇగో నర్సిగా నాకు సర్పంచ్ ఎలచ్చన్ల అందరు పని సేసిండ్రు. అందుకే గాళ్లని నారాజ్ జేయాలె. ఇగ ఎలచ్చన్ల ఓల్లు గెలిత్తే ఆల్లే మనోల్లు. మనం సప్పుడుదాకా ఊకుంటే అయిపాయే. సర్పంచ్ ఎలచ్చన్ల పని సేసిండ్రని గాల్లని బట్కొని తిరిగితే ఎలచ్చన్‌లు అయినంక అన్ని పార్టీలోల్లతోని లొల్లే. సర్పంచ్ ఎలచ్చన్లప్పుడు మనం ఒడ్డు ఎక్కేతందుకు మత్తు సెపుతం. మాట ఇచ్చినం గదా అని గాల్లకు పెచారం సేత్తే మనం మైనస్ అవుతంరా బై.
(ఒడ్డెక్కెదాకా ఓడ మల్లయ్య.. ఒడ్డెక్కినంక బోడి మల్లయ్య.. అనుడే రాజికీయమేమో అని నర్సయ్య తనలో తాను గునుక్కుంటూ వెళ్లిపోయాడు.)
గిదే రాజికీయమంటే..
Published Wed, Mar 19 2014 3:23 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement