కెసిఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ వ్యూహాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. మొదట శాసనసభకు మాత్రమే రెండు చోట్ల నుంచి పోటీ చేయాలనుకున్న కెసిఆర్ ఇప్పుడు లోక్సభకు కూడా పోటీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లోక్సభకు మహబూబ్నగర్ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి, శాసనసభకు గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గెలుపుపై కెసిఆర్ సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కెసిఆర్ వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీలోనే తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలువురు ఆ పార్టీని కూడా వీడుతున్నారు. ఆ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు చెరకు సుధాకర్ అభిమానులు ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. సుధాకర్ రేపు టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపట్ల నేతలలో అసంతృప్తి నెలకొంది. కె.సముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మన్నకు ఎంపీటీసీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఆయన టీఆర్ఎస్‌ను వీడి టీడీపీలో చేరారు.