ఓట్ల లెక్కింపు కేంద్రాలివే
Published Tue, Apr 8 2014 12:00 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
సాక్షి, కాకినాడ:తొలి విడత స్థానిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. మలివిడత పోరు ఈ నెల 11 న జరుగనుంది. కొంచెం తెరిపిన పడిన జిల్లా యంత్రాంగం మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఈ నెల 12 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 19వ తేదీతో ముగియనుండగా 21 వ తేదీన నామినేషన్ పత్రాల స్క్రూట్నీ జరగనుంది. ఉపసంహరణల ప్రక్రియ ఈ నెల 23 తో ముగిసి అదే రోజు నుంచి ప్రచారం మొదలై మే నెల 5 వ తేదీ సాయంత్రం అయిదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది. మే నెల 7 వ తేదీన పోలింగు నిర్వహించనుండగా ఓట్ల లెక్కింపు అదే నెల 16న నిర్వహిస్తారు. జిల్లాలో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రధాన కేంద్రమైన కాకినాడలోనే నిర్వహిస్తారు. దాదాపు 37 లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీల ఈవీఎంలు.. ఎక్కడ లెక్కింపు చేపడతారో అక్కడే గట్టి భద్రత మధ్య ఉంచుతారు.
జేఎన్‌టీయూకేలో కాకినాడ...
కాకినాడ పార్లమెంటుతో సహా దాని పరిధిలోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్శిటీ ఆవరణలోని పెట్రోలియం ఇంజనీరింగు అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగు బ్లాక్‌ల్లోనే విడివిడిగా చేపడతారు.
విద్యుత్‌నగర్ ఐడియల్‌లో అమలాపురం ...
కాగా అమలాపురం పార్లమెంటు, దాని పరిధిలోని రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీల ఓట్ల లెక్కింపును స్థానిక విద్యుత్ నగర్ ఐడియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ బ్లాక్ దాని పరిధిలోని వివిధ బ్లాక్‌లలో చేపడతారు. ఇదిలావుండగా విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలో వున్న జిల్లా పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును కూడా విద్యుత్ నగర్ ఐడియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే నిర్వహిస్తారు.
రంగరాయలో రాజమండ్రి...
ఇక రాజమండ్రి పార్లమెంటు, దాని పరిధిలోని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలోని అనాటమీ విభాగానికి చెందిన ఫ్లోర్స్ లోను, ఎగ్జామినేషన్ హాల్‌లోనూ నిర్వహిస్తారు.
Advertisement