సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించే(స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం జరుగుతుంది.
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించే(స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం జరుగుతుంది. ఆయా నామినేషన్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. సక్రమంగా లేనివాటిని తిరస్కరించడంతోపాటు పోటీలో ఎంత మంది మిగిలింది ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగుస్తుంది.
అసెంబ్లీకి 4,173, లోక్‌సభ స్థానాలకు 573 నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 4,173 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 573 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం అన్ని జిల్లాలనుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 513 మంది, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 123 మంది నామినేషన్లు దాఖలు చేశారని సీఈవో కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.