బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే!: వెంకయ్య నాయుడు
* కాంగ్రెస్‌పై బీజేపీ నేత వెంకయ్య వ్యాఖ్య
* ఆంధ్ర, తెలంగాణల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టే దేశమంతటా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. బస్ యాత్రలు చేసినా, సమ్మేళనాలు పెట్టినా కాంగ్రెస్ కోలుకునే పరిస్థితే లేదన్నారు. బస్ యాత్రల అనుభవంతో ఆ తర్వాత తాపీగా తీర్థయాత్రలు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావులతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన నిర్ణయానికి కట్టుబడి విశ్వసనీయతను నిలుపుకున్నామని, అదే సమయంలో సీమాంధ్రకు ప్రత్యేకహోదా దక్కేలా చేశామని వివరించారు. ఉభయ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు.
తాము సుపరిపాలన, అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే రాహుల్‌గాంధీ మాత్రం 2002 అల్లర్ల గురించి లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 32 సీట్లున్నప్పుడు ఏమీ చేయలేని కొందరు వ్యక్తులు ఇప్పుడు 25 లోక్‌సభ సీట్లు ఇస్తే ఏదో పొడిచేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడమేనని అన్నారు. రాష్ట్రంలో పొత్తులపై భావసారూప్యత ఉన్న వ్యక్తులు, పార్టీలతో అరుణ్‌జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ సంప్రదిస్తున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. మూడో ఫ్రంట్ విఫలకూటమని, ప్రజలు మోడీని చూసి కమలానికి ఓటు వేస్తారని చెప్పారు. ఓటమికి భయపడే చిదంబరంలాంటి వాళ్లు పోటీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ చెంచా అని అభివర్ణించారు. మోడీపై కేజ్రీవాల్ సహా ఎవరైనా పోటీ చేయవచ్చని, ఎవరికీ భయపడబోమని చెప్పారు.