ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఏ అర్హత ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజులరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు.. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలను కార్యకర్తలు నిలదీశారు. ఆదివారం ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే లింగారెడ్డి స్వగృహానికి వచ్చారు. ఎమ్మెల్యే దంపతులతో చాలా సేపు చర్చలు జరిపారు.
ఇంతలో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీలు ఎందుకు వచ్చారు.. వెంటనే బయటకు వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడిని కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వ్యక్తికి 15 రోజుల్లోనే టికెట్ ఇచ్చినా ఏ ఒక్క టీడీపీ నాయకుడు ఖండించిన పాపాన పోలేదని మండి పడ్డారు. గది తలుపులను తడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకానొక దశలో గన్‌మెన్‌లు కార్యకర్తలను అదుపుచేసేందుకు చాలా ప్రయత్నించారు. గది నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే లింగారెడ్డి శాంతించాలని చెప్పడంతో ... అలా ఉన్నందునే ఇలా జరిగిందని కార్యకర్తలు అన్నారు. అనంతరం ఒక్క సారిగా కార్యకర్తలు గదిలోకి వచ్చి ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థుల ఎదుట తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఏనాడూ టీడీపీ జెండా మోయని వ్యక్తికి టికెట్ ఇచ్చి.. 20 ఏళ్ల పాటు జెండా మోసిన వ్యక్తిని పార్టీకి దూరం చేయడంలో దళారులుగా ఎంపీ రమేష్‌నాయుడు, సురేష్‌నాయుడు వ్యవహరించారన్నారు. టికెట్‌ను రూ.కోట్లకు అమ్ముకుని తమ ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు.
లింగారెడ్డికి జరిగిన అన్యాయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనిస్తున్నారని టీడీపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ గెలిచే అవకాశం లేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయకుడు కూడా ఈ విషయంపై ప్రశ్నించడం కానీ, ఖండించడం కానీ చేయలేదన్నారు. పని చేయించుకుని వదిలివేయడమేనా చంద్రబాబు నాయుడికి తెలిసిన న్యాయం అని ప్రశ్నించారు. కార్యకర్తల మాటలకు ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి సమాధానం చెప్పలేక పోయారు. ఎమ్మెల్యే లింగారెడ్డి కార్యకర్తలను సముదాయించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
టీడీపీ కార్యకర్తల భూముల్లో అలైన్‌మెంట్ మార్చిన వరద
కూందు-పెన్నా వరదకాలువ విషయంలో వరదరాజులరెడ్డి టీడీపీ నాయకుల భూముల్లోకి అలైన్‌మెంట్ మార్చి నాశనం చేశాడు. అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం దారుణం. మేము ఏవిధంగా అతనికి మద్దతు ఇవ్వాలి. 25 ఏళ్ల వరదతో వైరం 20 రోజుల్లో పోతుందా. గ్రామాల్లో ఘర్షణలు జరిగి కాళ్లు, కళ్లు పోగొట్టుకున్నాం.. ఇది చంద్రబాబుకు తెలియదా...లింగారెడ్డికి తీరని అన్యాయం చేశారు.
- అంకాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు, పర్లపాడు
కార్యకర్తలే బుద్ధి చెబుతారు
జిల్లాలో టీడీపీని నిలబెట్టిన ఏకైక నాయకుడు లింగారెడ్డి. అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వరదరాజులరెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు. టికెట్‌ను పోట్లదుర్తి నాయకులు అమ్ముకుని తీవ్ర అన్యాయం చేశారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారికి కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారు.
-ప్రభాకర్‌రెడ్డి, పొట్టిపాడు
ఎందుకొచ్చారు..!
Published Mon, Apr 21 2014 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement