బిల్గేట్స్కు కంప్యూటర్ గురించి చెప్పింది ఎవరో తెలుసా?
సాప్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాప్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్కు కంప్యూటర్ గురించి చెప్పింది ఎవరో తెలుసా? మన దేశంలో కంప్యూటర్ విద్యను ప్రమోట్ చేసింది ఎవరో తెలుసా? అంతెందుకు కంప్యూటర్ను కనుగొన్నది ఎవరో తెలుసా? మన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రసంగాలు వింటే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిపోతాయి. వీటన్నింటికీ తానే ఆధ్యుడినని అన్నట్లు చంద్రబాబు ప్రసంగాలు ఉంటాయి. ఆయన స్వగతాల తీరు అలా సాగిపోతోంది. ఇంతటితో ఆగలేదు హైదరాబాద్లో హైటెక్ సిటీని కట్టింది తానే అంటారు. సాప్ట్వేర్ రంగాన్ని ముందుకు నడిపించిందీ కూడా తానే అంటూ ఆయన ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆయనకు మైకు దొరికితే "చూడండి తమ్ముళ్లూ హైటెక్ సిటీని కట్టింది నేను. ఐటీ రంగాన్ని గుర్తించింది నేను.యువతను ఐటీ రంగం వైపు నడిపించింది నేను. ఐటీ ఎగుమతులను రికార్డు స్థాయిలో పెంచింది నేను. నా హయాంలో ఐటీ రంగం అభివృద్ధిని చూసి బిల్ గేట్సే మెచ్చుకున్నాడు" అని చెబుతుంటారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడి పాలనలో ఐటీ రంగం దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా తీసికట్టుగానే ఉంది.
చంద్రబాబు పాలనలో ఐటీ రంగం ఎలా ఉంది? ఐటీ ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? హైటెక్ సిటీ నిర్మాణం ఎవరికోసం జరిగింది? ఎవరికి మేలు జరిగింది? ఎవరి జేబులు నింపింది? చంద్రబాబు నాయుడి హయాంలో ఐటి ఎగుమతులు దేశం మొత్తంతో పోలిస్తే 6 శాతం ఉన్నాయి. చంద్రబాబు నాయుడి తర్వాత 2004 లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అవే ఐటీ ఎగుమతులు 15 శాతానికి పెరిగాయి. అంటే రెండున్నర రెట్లు పెరిగాయి. చంద్రబాబు చెప్పుకునే ఐటీ జమానా కన్నా 250 శాతం ఎక్కువ. మరో ముఖ్య విషయం ఏమిటంటే చంద్రబాబుకు ముందు మన రాష్ట్రం ఐటి ఎగుమతులలో మూడవ స్థానంలో ఉండేది. ఆయన హయాం వచ్చేసరికి 4వ స్థానానికి దిగజారింది. వాస్తవాలు ఇలా ఉంటే ఐటి రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనన్న భ్రమలో ఆయన ఉంటారు. ఐటీ ఛాంపియన్ని తానేనని చెప్పుకుంటుంటారు. ప్రజలను నమ్మించడానికి, వారి చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. చీటికీ మాటికీ హైటెక్ సిటీ తానే కట్టించానని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెబుతూనే ఉంటారు.
హైటెక్ సిటీ నిర్మాణం వెనుక మతలబు: హైటెక్ సిటీ నిర్మాణం వల్ల చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు లబ్దిపొందినట్లు ఒక పరిశోధనలో తేలింది. ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు ఎక్కడా బయటపెట్టారు. లండన్ ఎకనామిక్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ దలేల్ బెన్బాబాలి అనే విదేశీ మహిళ తన పిహెచ్డి కోసం ఈ హైటెక్ సిటీ నిర్మాణంపై పరిశోధన చేశారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే జూబిలీ హిల్స్, కెపిహెచ్బి ప్రాంతాలకు దగ్గరలోనే హైటెక్ సిటీ కట్టించారని తెలిపారు. తన సామాజిక వర్గానికి చెందిన ఆస్తుల విలువలు ఆమాంతం పెరిగేందుకు చంద్రబాబు దోహద పడ్డారని పేర్కొంది.
హైటెక్ సిటీలో రాష్ట్ర వాటా కేవలం 18 శాతమే. స్థలం మనదే అయినా అంత తక్కువ వాటా ఉండడానికి కారణాలు వేరే ఉన్నాయి. హై టెక్ సిటీ నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ఎల్ అండ్ టి కంపెనీకి అప్పగించారు. వారితో జరిగిన ఒప్పందంలో భాగంగా 40 నుంచి 50 శాతం వరకు ఉండవలసిన మన వాటాను 18 శాతానికే తగ్గించారు. దానికి ప్రతిఫలంగా ఎల్ అండ్ టి సంస్థ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హై టెక్ సిటీ నిర్మాణంలో బోలెడు అవకతవకలు జరిగాయని అప్పట్లో శాసనసభలో విపక్షాలు విరుచుకు పడ్డాయి. లెక్కకు మించి అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.
అలాగే హై టెక్ సిటీ చుట్టూ పక్కల భూములను చంద్రబాబు సూచన మేరకే సినీనటుడు మురళీ మోహన్ ముందుగానే కొని కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రబాబు కూడా వాటాదారుడని అప్పట్లో అసెంబ్లీలోనే అన్ని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే పుంఖాను పుంఖాలుగా వెల్లువెత్తిన ఈ ఆరోపణలను చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన హయాం నాటి అధికారులు కానీ ఏనాడూ ఖండించ లేదు. హై టెక్ సిటీ నిర్మాణంలో జరిగిన గోల్ మాల్ ఆరోపణలకు వివరణ కూడా ఇవ్వలేదు. సొంత లాభం కొంత చూసుకుని హై టెక్ సిటీ నిర్మించిన చంద్రబాబు అదేదో జాతి ప్రయోజనాల కోసమే కంకణం కట్టుకున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని ఐటీ రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.
పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి, పార్టీలో పదవి నిచ్చి ప్రోత్సహించిన ఎన్టీఆర్ నుంచి పదవినీ, పార్టీనీ లాక్కున్న చంద్రబాబు నాయుడు అడ్డగోలు విధానాలతో పార్టీ పేరును చెడగొడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మనస్తాపం చెందుతున్నారు. ఇంత చేసిన చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే ఏం చేస్తారో తమకు తెలుసని పలువురు అంటున్నారు.