
'ఇచ్చిన మాటకోసం తుదివరకూ నిలబడతా'
రాష్ట్రాన్ని అయితే విభజించారు గానీ... తెలుగు జాతిని వేరుచేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నల్గొండ : రాష్ట్రాన్ని అయితే విభజించారు గానీ... తెలుగు జాతిని వేరుచేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నల్గొండ జిల్లా కోదాడ బహిరంగ సభలో ప్రసంగించారు. రెండ్రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి...ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలో మనకు మనం ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు. ఏ వ్యక్తి అయితే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాడో...అలాంటి వ్యక్తినే మనం తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని విశ్వసనీయత అంటే కనపడని విధంగా రాజకీయాలు మారిపోయాయని జగన్ వ్యాఖ్యానించారు.
చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు అయితే ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలనేలా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగిందని జగన్ అన్నారు. మహానేత మరణాంతరం అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని...ఆయన మృతితో పేదోడి కోసం ఆలోచించే నాయకుడే లేకుండా పోయారన్నారు. అక్కచెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెడుతున్నందుకు గర్వపడుతున్నానని జగన్ అన్నారు.
రెండు నెలల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర దశ, దిశ మార్చే విధంగా అయిదు సంతకాలు చేస్తానని తెలిపారు. సీమాంధ్రలో అమలు చేయబోయే పథకాలు తెలంగాణలోనూ అమలు అమలు అవుతాయని జగన్ వెల్లడించారు. ఇచ్చిన మాట కోసం, పెట్టే సంతకం కోసం తుదివరకూ నిలబడతానని ఆయన స్పష్టం చేశారు.