
'జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు'
తిరువూరు: సంక్షేమ పథకాలతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డు సృష్టించారని వైఎస్ షర్మిల అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒక్క రూపాయి కూడా ప్రజలపై పన్ను భారం పడనివ్వలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కృష్ణా జిల్లా తిరువూరులో జరిగిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు.
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేశారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేసిందని గుర్తు చేశారు. జగనన్నను సీఎం చేద్దాం, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. జగనన్న సీఎం అయితే మహానేత వైఎస్సాఆర్ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పారు. ఒక్క అవకాశమిస్తే తన జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా జగనన్న ఉన్నారని తెలిపారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని షర్మిల అన్నారు. కాగా, షర్మిల రోడ్ షోకు తరలివచ్చిన జనంతో తిరువూరు జనసంద్రంగా మారింది.