జనాభిమానం
ఎన్నికల ప్రచారంలో జగన్, విజయమ్మ, షర్మిల
సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు
‘వైఎస్సార్ జనభేరి’ సభలు,
రోడ్‌షోలకు పోటెత్తుతున్న జనం
పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న సమరోత్సాహం
సాక్షి, హైదరాబాద్: మూడు ఎన్నికలు ముంచుకు వచ్చిన వేళ, ప్రత్యర్థి రాజకీయపక్షాలు ఇంకా ఇల్లు సర్దుకుంటుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీకి అగ్రశ్రేణి ప్రచారకర్తలైన అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల... ముగ్గురూ సోమవారం మూడు జిల్లాల్లో నిర్వహించిన ప్రచార సభలకు పెద్దసంఖ్యలో జనం హాజరవడమే కాకుండా స్పందించిన తీరు రాజకీయవర్గాల్లో ఆలోచనలు రేపుతోంది. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ముగ్గురు నాయకులూ నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలు జనప్రంభజనంతో సాగాయి. అడుగడుగునా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. సభలు ప్రకటించిన సమయం కన్నా ఆలస్యంగా జరిగినా జనం ఓపికతో నిలిచి ఆయా నేతల ప్రసంగాలు పూర్తయ్యేవరకు ఆసక్తిగా విన్నారు. ప్రచార సభలకు హాజరైన వారిలో దాదాపు అన్ని వయసుల వారుండటమే కాకుండా ఇది వివిధ సామాజిక నేపథ్యం ఉన్నవారి కలబోతగా సాగింది.
వైఎస్సార్ పాలనకు జేజేలు..
నాయకుల ప్రసంగాల్లో... వైఎస్సార్ పాలనను ప్రస్తావించినపుడు హర్షాతిరేకాలు, అంతకు ముందు చంద్రబాబు పాలన, తదనంతరపు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనా కాలాన్ని విమర్శించినపుడు విపరీతమైన స్పందన కనిపించింది. ప్రయాణాలు, రోడ్‌షోలలో సమయం ఎక్కువ పట్టడం కారణంగా నేతలు సభలకు ప్రకటించిన సమయం కన్నా ఆలస్యంగా హాజరయ్యారు. పశ్చిమగోదావరి రోడ్ షోలో జనప్రవాహంతో ఆలస్యమవడమే కాక, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కిక్కిరిసిన జన సందోహం మధ్య సభాస్థలికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో సమయాభావం వల్ల పది నిమిషాలు మాత్రమే ప్రసంగించినా పెద్ద ఎత్తున జన స్పందన కనిపించింది. అనంతపురంలో విజయమ్మ రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీపెద్ద సంఖ్యలో మోహరించిన మహిళలు, విద్యార్థులు ఓపికగా ఆమె ప్రసంగం విని స్పందించారు. ముఖ్యంగా డ్వాక్రా రుణాల రద్దు గురించి చెప్పినపుడు పెద్ద ఎత్తున్న ప్రతిస్పందించారు. షర్మిల సభ ఆత్మకూరులో మరింత ఆలస్యంగా జరిగింది. విజయమ్మ, షర్మిల ఇరువురు నేతలు సుమారు నలభయ్యేసి నిమిషాల సేపు ప్రసంగించారు.
సుడిగాలి పర్యటనలు..
రాష్ట్రంలో మున్సిపల్, పంచాయితీరాజ్ ఎన్నికల సమరోత్సాహం, లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొన్న ప్రస్తుత తరుణంలో వైఎస్సార్ సీపీ ప్రచారంలో అగ్రభాగాన దూసుకు వెళుతూండటం పార్టీ శ్రేణులకు హర్షాతిరేకం కలిగిస్తోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డమే కాక నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక పంచాయితీరాజ్ ఎన్నికల్లో సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిల మూడు వైపుల నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి ముగ్గురు ‘స్టార్ క్యాంపెయినర్ల’ (అగ్రశ్రేణి ప్రచారకర్తలు) రూపంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూండటం పార్టీ నేతలు, కార్యకర్తలకు మంచి ఊపునిస్తోంది. జగన్‌పైనా, వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా ప్రత్యర్థి పార్టీలు, వ్యతిరేక మీడియా పనిగట్టుకుని సాగిస్తున్న దుష్ర్పచారాన్ని ఈ ముగ్గురు నేతలు తమ ప్రసంగాల్లో తిప్పి కొట్టడమే కాక మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు.