మోసం చేయడమే చంద్రబాబు నైజం
తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు..ఇప్పుడు అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన నీచమైన రాజకీయాలు చేసేందుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని పెద్దాపురం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకి ఏమైనా తెలిసి ఉంటే అది మోసం చేయటమేనిని జగన్ ఎద్దేవా చేశారు. అసలు మోసం చేయడమే బాబు నైజమని అభివర్ణించారు.
ఆరోగ్యం కోసం అప్పులు చేసి జీవితాంతం ఊడిగం చేసే పాడు రోజులు చూశామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఆయన హయాంలో భయానక పరిపాలన చూశామన్నారు. బాబు పాలనలో నిరుపేదలకు పక్కాఇళ్లు వచ్చేవికావని, వరుస కరువులతో చితికిపోయిన రైతన్నలను కరెంట్ బిల్లుల కోసం జైళ్లల్లో పెట్టిన ఘనుడు చంద్రబాబునేనని జగన్ తెలిపారు. బక్కచిక్కిన రైతులను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసిన ఘనత మాత్రం బాబుకే దక్కుతుందని జగన్ స్పష్టం చేశారు. 'లక్షన్నర కోట్ల అప్పు మాఫీ చేస్తానని అబద్దాలతో వస్తున్నాడు. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు... ఆల్ ఫ్రీ వాగ్దానాలతో మోస పోకండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ ఉంటుందో లేదో చెప్పడం కష్టం. చంద్రబాబుకు లేనిది, నాకు ఉన్నది విశ్వసనీయత ఒక్కటే' అని జగన్ తెలిపారు.
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఆయనకు ప్రజలను మోసం చేయడం ఏమంత కష్టం కాదన్నారు. ఆనాడు రైతులను జైల్లో పెట్టించిన బాబు.. రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పేదవాడి ఆరోగ్యం కోసం తపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్సారేనని జగన్ తెలిపారు. ప్రతీ పేదవాడు పెద్దాసుపత్రులకు వెళ్లగలిగేలా చేసింది మాత్రం ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అని ప్రజలకు మరోమారు గుర్తు చేశారు. తిరిగి రాజన్న రాజ్యాన్ని చూడాలంటే రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.