సాక్షి ప్రతినిధి, గుంటూరు :ఓదార్పునకు ప్రతిరూపం.. పేద ప్రజలకు ఓ భరోసా.. మాట తప్పని వైనం.. మడమ తిప్పని నైజం.. ఆ జననేతకే సాధ్యం. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన జననేతకు డెల్టా ప్రజ నీరాజనం పలికింది. ఆయనను చూడగానే మహానేత రాజన్నపై ఉన్న అభిమానం ప్రతి గుండెలో ప్రతిధ్వనించింది. ప్రతి కంటిలో సాక్షాత్కరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ జనభేరికి బ్రహ్మరథం పట్టారు. సోమవారం రాత్రి జిల్లాకు చేరిన జగన్ మండల కేంద్రం కొల్లిపరలో గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు మాతృవియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కుటుంబసభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. 11.05 గంటలకు జనభేరి ప్రచార రథంపైకి చేరిన జగన్ రోడ్‌షో ప్రారంభించారు. ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతూ అభిమానాన్ని పూలజల్లులుగా కురిపించారు.
కార్మికులకు జగన్ భరోసా..
కొల్లిపరలో ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అధిక సంఖ్యలో బారులు తీరి రాజన్న బిడ్డను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్‌షో తుములూరు అడ్డరోడ్డుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఇటుకబట్టీ కార్మికులను పలుకరించారు. వారు జగన్‌కు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఇళ్ల స్థలాలు ఇంత వరకు ఇవ్వలేదన్నా... అని చెప్పగా అధికారంలోకి రాగానే మీ కష్టాలన్ని తీరుతాయంటూ జగన్ వారికి భరోసా ఇచ్చారు. రోడ్‌షో శివలూరుకు వెళ్లే సమయంలో అక్కడకు వచ్చిన మహిళ రైతులు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ జగన్‌కు వివరించారు. ‘20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర నేను కల్పిస్తాను’ అంటూ హామీ ఇచ్చారు. వృద్ధులను పలుకరించిన జగన్ అవ్వా మన ప్రభుత్వం రాగానే మీకిచ్చే రూ. 200 పింఛనును రూ. 700కు పెంచుతాననంటూ చెప్పడంతో మేమంతా నీవెంటే ఉంటామంటూ వారు ఆశీర్వదించారు.
అండగా ఉంటానంటూ రైతులకు అభయం..
రోడ్‌షో శిరిపురం అడ్డరోడ్డుకు చేరుకోగానే స్థానికులు పూలవానతో జగన్‌ను ముంచెత్తారు. అక్కడి నుంచి అత్తోట బయలు దేరిన జగన్‌ను మార్గమధ్యంలో రైతులు ఆపి ‘అయ్యా .. మీనాన్న ఉన్నప్పుడు మాకు గిట్టుబాటు ధర కల్పించారు. ప్రస్తుతం మమ్మల్నిపట్టించుకునే నాధుడే లేకపోయార’ని జగన్ వద్ద వాపోయారు. స్పందించిన జగన్ రైతులకు తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. దీంతో వారు ఆ ఆశతోనే బతుకుతున్నామయ్యా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. రోడ్‌షో అత్తోట చేరే సమయానికి ఆ గ్రామంలో ప్రధాన కూడళ్లు, డాబాలన్ని జనాలతో నిండిపోయాయి. పూలతో ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుంచి కుంచవరం అడ్డరోడ్డు మీదుగా నందివెలుగు సెంటర్‌లోని శబరి వృద్ధాశ్రమం వద్ద మధ్యాహ్న భోజనానికి ఆగారు.
కాజలో మహిళల హారతులు..
భోజన విరామానంతరం మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం చింతలపూడికి జనభేరి ప్రచార రథం చేరుకుంది. ఆ గ్రామస్తులు జననేతను సాదరంగా తమ గ్రామానికి తోడ్కొని వెళ్లారు. బారులు తీరిన ప్రజలకు అభివాదాలు చేస్తూ జగన్ ముందుకు సాగారు. అక్కడి నుంచి దుగ్గిరాల చేరుకున్న ఆత్మీయ అతిథిని స్థానికులు సాదరంగా ఆహ్వానించారు. పెనుమోలు వెళ్లే వరకు జగన్ కాన్వాయ్ వెంట నడిచారు. అనంతరం పెనుమోలు చేరుకున్న జగన్‌కు యువకులు ద్విచక్ర వాహనాల ర్యాలీతో స్వాగతం పలికారు. నంబూరు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రోడ్‌షోగా వచ్చిన జగన్ తనకోసం ఎదురు చూస్తున్న జనవాహినికి అభివాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. కాజ గ్రామంలో మహిళల హారతులిచ్చి ఆశీర్వదించారు. అక్కడి నుంచి చినకాకాని మీదుగా మంగళగిరి చేరుకున్న జగన్ రోడ్లపై చేరిన జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
విశ్వసనీయతకు.. కుట్రకు మధ్యే పోరు..
మంగళగిరి పట్టణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రాంగ ణానికి చేరుకున్న జగన్ సభలో ప్రసంగిస్తూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయతీ ఒకవైపు ఉంటే మరోవైపు కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు హాజరై జగన్ ప్రసంగిస్తున్న ప్రతిమాటకు హర్షధ్వానాలు చేశారు.
తెనాలి జనదిగ్బంధం
మంగళగిరి నుంచి రోడ్‌షో నిర్వహిస్తూ జగన్ తెనాలి చేరుకున్నారు. అప్పటికే ఆ పట్టణం జనసంద్రమైంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సిన జగన్ అప్పటికే ప్రచార సమయం మించి పోవడంతో ప్రసగించలేదు. తన కోసం వేచి ఉన్న అభిమానులు, కార్యకర్తలను నిరుత్సాహ పరచకుండా పది నిమినిమిషాల పాటు వారి మధ్యే కలియదిరుగుతూ అభివాదం చేశారు. అనంతరం వినుకొండకు బయలుదేరారు. రెండు నియోజకవర్గాల పరిధిలో సాగిన రోడ్ షోలో పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు అన్నాబత్తుని శివకుమార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దాది లక్ష్మీరాజ్యం, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
నేటి పర్యటన సాగేదిలా...
జననేత బుధవారం నాటి పర్యటన గుంటూరు, ప్రకాశం జిల్లాలో సాగుతుందని వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. వినుకొండ, అద్దంకి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటలకు వినుకొండలో బహిరంగ సభ, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకాశం జిల్లా సంతమాగులూరులో రోడ్డుషో నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడతారని వివరించారు.