
జననేతకు ఘన స్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘వైఎస్సార్ జనభేరి’ సోమవారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించింది.
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘వైఎస్సార్ జనభేరి’ సోమవారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాకు వచ్చిన జననేతకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని జగన్ సరిగ్గా రాత్రి 8.15 గంటలకు గుంటూరు జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించారు. గుంటూరు నుంచి కొలకలూరు, నందివెలుగు మీదుగా కాన్వాయ్ మండల కేంద్రం కొల్లిపరకు చేరుకుంది. జగన్ ప్రచార రథంలోనే కూర్చుని రహదారులపై తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేస్తూ నేరుగా కొల్లిపర బస కేంద్రానికి చేరుకున్నారు. మార్గమధ్యలో ప్రతి గ్రామంలో ప్రధాన రహదారుల వెంట జనం జగన్‌ను చూసేందుకు బారులుతీరారు. జగన్ తమ గ్రామంలో నుంచి వెళతారని తెలుసుకుని ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూపులు చూశారు. గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌లు ఎదురేగి స్వాగతం పలికారు. కొల్లిపరలోని గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు.