షర్మిలమ్మకు జేజేలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు మెతుకుసీమ ప్రజలు నీరాజనాలు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆమెకు ప్రజలు జేజేలు పలికారు. సోమవారం నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో షర్మిల నిర్వహించిన జనభేరి రోడ్‌షోలకు అన్నివర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ అభిమానులు, మహిళలు, యువకులు ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. కరచాలనాలు చేసేందుకు ఉత్సాహం కనబర్చారు. రోడ్‌షోలో షర్మిల ప్రసంగాలకు విశేష స్పందన లభించింది. ‘మీ రాజన్న కూతురిని.. జగనన్న చెల్లెలిని.. మీ అందరికీ నమస్కారం’ అంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. షర్మిల తన ప్రసంగంలో టీడీపీ అధినేత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనపై వాగ్బాణాలు సంధించినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నారాయణఖేడ్, జహీరాబాద్‌లో ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు షర్మిల ప్రసంగాన్ని ఆలకించారు. వైఎస్సార్ జిందాబాద్... వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ యువకులు రోడ్‌షోల్లో భారీగా నినాదాలు చేస్తూ సందడి చేశారు. తన ప్రయాణమార్గంలో షర్మిల ప్రజలకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ముందుకుసాగారు.
నారాయణఖేడ్‌లో రాజీవ్ చౌక్‌వద్ద జరిగిన సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంగ్టి, మనూరు, కల్హేర్, పెద్దశంకరంపేట, ఖేడ్ మండలాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వాహనాల్లో ‘ఖేడ్’కు చేరుకున్నారు. కార్యకర్తలు వైఎస్సార్ సీపీ జెండాలను చేతబట్టుకుని రోడ్‌షోలో పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు షర్మిల ప్రసంగం విన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమానికి జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల నుంచి ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. షర్మిల ప్రచార రథంపైకి చేరుకోగానే ప్రజలు అభిమానంతో జేజేలు పలికారు.
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో షర్మిల రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్వకుంట రోడ్డు వద్ద నిర్వహించిన సభలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. షర్మిల ప్రసంగం కొనసాగుతున్నంతసేపూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్ ప్రాంతంలో షర్మిల రోడ్‌షో జరిగింది.
రోడ్‌షోకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్‌షోలో రాష్ట్ర నాయకుడు జనక్‌ప్రసాద్, మెదక్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్, సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియుద్దీన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావుషెట్కార్, జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.