
జన హోరు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ, రోడ్డుషోలకు హాజరైన జనంతో స్వర్ణముఖి నదీతీరం పోటెత్తింది.
- కిటకిటలాడిన స్వర్ణముఖి తీరం
- షర్మిల రోడ్‌షో, సభలకుభారీ స్పందన
- టీడీపీకి ఓట్లేస్తే మురిగిపోతాయ్
- రైతులకు, మహిళలకు, ఉద్యోగులకు బాబు చేసిందేమీ లేదు
- బియ్యపు మధు, వరప్రసాద్‌ను గెలిపించాలని షర్మిల పిలుపు
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ, రోడ్డుషోలకు హాజరైన జనంతో స్వర్ణముఖి నదీతీరం పోటెత్తింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. రాజన్న తనయను చూద్దామని భారీగా హాజరైన రైతులు, మహిళలతో పట్టణవీధులన్నీ కిక్కిరిశారుు. ఆదివారం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆ రోజు రాత్రి తిరుపతి రూరల్ మండలంలోని గొల్లపల్లెలో బసచేసిన ఆమె సోమవారం ఉదయం 11గంటలకు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పెండ్లిమండపం జంక్షన్లో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వర ప్రసాద్‌రావును గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాను తిప్పుతూ షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యాను చూపించి ఓటేయాలని కోరినప్పుడు జనం గాలిలోకి చేతులు తిప్పుతూ ఈ గుర్తుకే ఓటేస్తామని స్పందించారు.
షర్మిల మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు హయంలో ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మేలు జరగలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఏడు గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందజేశారన్నారు. రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. పేద విద్యార్థులు తమకు నచ్చిన బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఏదైనా ఉచితంగా చదివేందుకు ప్రభుత్వం నుంచి ఫీజులు కట్టారన్నారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల నిత్యావసరాల ధరలు, విద్యుత్‌చార్జీలు పెరిగి ఇబ్బందులు పడ్డారన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రూ.325 ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు రూ.450 అయ్యిందన్నారు. అదే సబ్సిడీ లేకుండా గ్యాస్ కొనుగోలు చేయాలంటే పేదలు సిలెండర్‌కు రూ.1000 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీకి ఓటేస్తే మురిగిపోతుందని, ప్రజలకు మళ్లీ తిరోగమనం తప్పదని షర్మిల హెచ్చరించారు.
‘జగన్‌మోహన్‌రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన జీవితం మీ కోసం త్యాగం చే స్తారు. మీ బాగోగులు జగనన్నకు ముఖ్యం, చంద్రబాబు విభజనవాది కాంగ్రెస్‌తో కలిసి అడ్డగోలు విభజనకు లేఖ ఇచ్చారు’ అని ఆమె అన్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. టీడీపీ, బీజేపీ కూటమని ఎన్నికల్లో ఓడించాలని, రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన పార్టీల్లో బీజేపీ కూడా ఒకటని ఆమె పేర్కొన్నారు.
షర్మిలను చూసేందుకు పోటీలు...
షర్మిల పట్టణంలోని నాలుగు మాడావీధులతో పాటు, స్వర్ణముఖి బ్రిడ్జి, శ్రీరాంనగర్ కాలనీ మీదుగా పానగల్ వరకు రోడ్డుషో నిర్వహించారు. ఫ్యాను గుర్తు చూపిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లేయాలని అభ్యర్థించారు. షర్మిలను చూసేందుకు మిద్దెలపైన, ఎత్తయిన భవనాలపైన మహిళలు,యువకులు కిక్కిరిసి ఉన్నారు. ఎండకు చెమటలు కారుతున్నా ఆమె ప్రసంగం పూర్తయ్యేవరకు అక్కడి నుంచి కదలలేదు.
వైఎస్సార్ సీపీ టోపీలు, జెండాలు చేతపట్టిన కార్యకర్తలు వీధుల్లో, సభాస్థలి వద్ద ఆకర్షణగా నిలిచారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట మండలాల నుంచి ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు షర్మిల బహిరంగసభ, రోడ్డుషోలకు భారీగా హాజరయ్యారు. సభలో తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్‌రావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రసంగించారు. రేణిగుంట మండలానికి చెందిన పలువురు నాయకులు షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. ఆమె కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.