
బాబు పాలన మొత్తం చీకటియుగం
అభివృద్ధి, సంక్షేమాలనే రెండు కళ్లుగా భావించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన కొనసాగిస్తే, చంద్రబాబు పాలన మాత్రం మొత్తం చీకటియుగంగా గడిచిందని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిర రోడ్షోకు అశేష సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అప్పట్లో వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం రుణమాఫీ చేస్తానంటున్నారని, అసలు బెల్టుషాపులు గ్రామాల్లోకి వెళ్లాయంటే చంద్రబాబు చలవేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ విజయమ్మ విమర్శించారు.
''మీరు పాలనలో ఉన్నప్పుడు కరెంట్ బకాయిలన్నా మాఫీ చేశారా? రైతులకు నష్టపరిహారం ఇస్తే దానికోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్లాంతా సోమరిపోతులు అవుతారన్నారు. సమస్యల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తే గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్టు ఉద్యోగాలు తెచ్చింది చంద్రబాబు కాదా? కేసుల మీద స్టే తెచ్చుకొని బతుకుతున్న బాబు ఇంకొకరిపై ఆరోపణలు చేస్తారు. జగన్ బాబును మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా. వైఎస్ జగన్‌ను గెలిపించుకుందాం...వైఎస్ ఆశయాలు నెరవేర్చుకుందాం'' అని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.