రుణం తీర్చుకుంటాం
సాక్షి ప్రతినిధి, కడప: అధికారానికి దూరంగా కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ద్వారా జీవం పోశారు.. రాష్ట్రంలో, కేంద్రంలో రెండు మార్లు అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు.. అలాంటి పార్టీ నుంచి వైఎస్ మృతి తర్వాత మాకుటుంబానికి అవమానాలు, ఛీదరింపులు ఎదురయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పడ్డ మాకు మీరు చూపిన ఆప్యాయత, ఆదరణతోనే ఇంతకాలం ముందుకు సాగాం.. మీ రుణం తీర్చుకుంటాం అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చక్రాయపేట, వీరపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు మండలాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ కడప జిల్లా ప్రజల ఆదరణ ఎన్నటికీమరువలేనిదన్నారు.
30 సంవత్సరాలు వైఎస్ రాజశేఖరరెడ్డికి అండగా నిలిచి, భుజాలపై మోశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చాక నన్ను, జగన్‌బాబును గుండెల్లో దాచుకున్నారని తెలిపారు. మీ కుటుంబసభ్యులుగా మమ్మల్ని చేర్చుకుని, మాపట్ల మీరు చూపిన ఆదరణ దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిందన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్‌బాబుకు 5,45,672 ఓట్లు తనకు 85వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ అప్పగించారని తెలిపారు. భారతదేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తులల్లో మూడో వ్యక్తిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారన్నారు. అది మీ ఆదరణ వల్లే సాధ్యమైందని వివరించారు. మీఆదరణను తొలిసారి ప్రత్యక్షంగా చూసిన నేను నా బిడ్డను మీకు అప్పగిస్తున్నానని తొలి ప్లీనరీలో తెలిపానని, ఆనాటి నుంచి నేటి వరకూ ప్రజలే తన కుటుంబంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారని వివరించారు.
వైఎస్సార్ లేనిలోటు జగన్‌తో భర్తీ...
వ్యక్తిగతంగా తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, విద్యార్థికి తండ్రిగా, తోబుట్టువులకు సోదరుడుగా,వృద్ధులకు మనవడిగా, రైతన్నలకు సహచరుడుగా, కార్మికులకు తమ్మునిగా జగన్‌బాబు అండగా నిలవగలరనే భరోసా, నమ్మకం తనకున్నాయని వైఎస్ విజయమ్మ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉండే వ్యక్తి అన్నగా, తమ్మునిలా, తండ్రిలా, కుటుంబపెద్దలా ఉండాలని.. రాజశేఖరరెడ్డి అలాగే వ్యవహరించారన్నారు.
అంతే పట్టుదల, దీక్ష, దక్షత వైఎస్ జగన్‌లో ఉన్నాయని తెలిపారు. మీ అందరి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించామని, ఆపార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాల్సిన బాధ్యత మీదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పట్టం కట్టేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల్లో మొత్తం మంత్రి వర్గం ఇక్కడే తిష్ట వేసి కుయుక్తులు పన్నినా మీరు మాకు అండగా నిలిచారన్నారు. నాలుగున్నర సంవత్సరాల పోరాటం తుదిరూపునకు వచ్చిందని, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ని గెలిపించుకోవాల్సిన లక్ష్యం మనముందు ఉందన్నారు.
తమ్ముడు...కుమారునికి అండగా నిలవండి....
నాతమ్ముడు పి.రవీంద్రనాథరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగాను, కుమారుడు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయనున్నారని వారిని ఆదరించాలని వైఎస్ విజయమ్మ కోరారు. జగన్‌బాబుకు అప్పగించిన మెజార్టీని అవినాష్‌రెడ్డికి అందించాలని కోరారు. త మ్ముడు రవీంద్రనాథరెడ్డి చింతకొమ్మదిన్నె జడ్‌పీటీసీగా ఆమండలాన్ని ఎంతో అభివృద్ధి పర్చారన్నారు. కమలాపురం నియోజకవర్గాన్ని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలరని విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. కమలాపురం ప్రజలకు మాకుటుంబంతో ప్రత్యక్ష అనుబంధం ఉందన్నారు. మిమ్మల్ని ఎప్పటికి మరువలేమని వివరించారు. కమలాపురానికి అవసరమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి, మైలవరం కాలువ నుంచి చెరువులకు నీరు, సర్వారాయసాగర్, వామికొండ రిజర్వాయర్ల నిర్మాణం, ఆదినిమ్మాయపల్లె నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వల్లూరు మండలానికి సాగునీరు, పర్యాటక కేంద్రంగా పుష్పగిరి కావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభలలో పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం అభ్యర్థి పి రవీంద్రనాథరెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి జడ్‌పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.