
రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యం
రాష్ట్రంలో రాజన్న రాజ్యం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు.
పెదపారుపూడి, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రాజన్న రాజ్యం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో బందరు పార్లమెంట్ సెగ్మెంట్‌తోపాటు జిల్లాను అభివృద్ధిబాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పామర్రు నియోజకవర్గం, పెదపారుపూడి మండలంలోని యలమర్రు, చినపారుపూడి, ఈదరమాద్దాల, పెదపారుపూడి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పులేటి కల్పన, జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతితో కలిసి సారథి పర్యటించారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని గుర్తుచేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో రైతులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంతో రైతుల కన్నీరు తుడిచి, వారిపాలిట దైవంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. టీడీపీ పాలనలో రాష్ట్రవ్యాపంగా అన్నిరకాల పింఛన్లు కేవలం 18 లక్షల మందికి మాత్రమే అందాయని, వైఎస్సార్ హయాంలో వృద్ధులకే 52 లక్షల పింఛన్లు అందాయని పేర్కొన్నారు. బాబు హయాంలో వలస వెళ్లిన ప్రజలు కూడి రాజశేఖరరెడ్డి పాలన సమయంలో తిరిగి గ్రామాలకు చేరుకుని సుఖంగా జీవించారని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను, కల్పనను గెలిపించాలని కోరారు.
ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని దివంగత నేత రాజశేఖరరెడ్డి వారసత్వంతో జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదు సంతకాలతో రాష్ట్రం దశా దిశా మారుస్తారని భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, జిల్లాకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నూతన కళాశాలలు తీసుకొచ్చే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని తాతినేని పద్మావతి అన్నారు.
గంగనమ్మ గుడిలో పూజలు
యలమర్రులోని గంగానమ్మ గుడిలో పార్థసారథి, కల్పన, తాతినేని పద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి ప్రచారానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేసి వైఎస్సార్ రుణం తీర్చుకుంటామని మహిళలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంటా దేవాదానం, మండల కన్వీనర్ గొరిపర్తి రవికుమార్, మండలయూత్ కన్వీనర్ కొడాలి చిన్నా, నాయకులు సూరపనేని సత్యనారయణ, సూరపనేని అజయ్, గొళ్ల సోమేశ్వరరావు, ఎలిసి డేవిడ్‌రాజు, ఉమా మహేశ్వరరావు, వాకా నాగలక్ష్మి భవాని, బోగం రామారావు, యనమదుల ఈశ్వర్, నామా వెంకటేశ్వరరావు, ముల్పూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.