ప్రచారంలో దూసుకెళ్తున్న బాలరాజు
టి.నరసాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంతగా దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ పల్లె ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధిపొందిందీ వివరిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మఒడి, డ్వాక్రా రుణాల రద్దు, రూ.100కే 150 యూనిట్ల విద్యుత్, పింఛన్ల మొత్తం పెంపు, పేదలకు ఇళ్ల నిర్మాణం, రైతులకు ఏడు గంటల నిరంతర విద్యుత్, రైతులకు ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఆదివారం టి.నరసాపురం మండలంలోని బందంచర్ల, కె.జగ్గవరం,గుడ్లపల్లి, రాజుపోతేపల్లి, అల్లంచర్లరాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు మోటార్ సైకిళ్లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాల వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. 2004లో తాను ఎమ్మెల్యే అయిన తరువాత పోలవరం నియోజకవర్గాన్ని రూ.500 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ ఎంపీపీ కొత్తా ప్రకాష్‌బాబు, సామంతపూడి సూరిబాబు, కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.