కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: మహానేత ప్రవేశ పెట్టిన పథకాలే తమ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. రమేష్‌బాబు ఆధ్వర్యంలోనగరంలోని 13వ వార్డు, 41వ వార్డులకు చెందిన ముస్లిం మహిళలు, యువకులు, విద్యార్థులు సుమారు 200 మంది పార్టీలో చేరారు. అలాగే ఇంతియాజ్, మోయిజ్‌ల నాయకత్వంలో 15, 11 వార్డులకు చెందిన యువకులు, విద్యార్థులు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరు నగరంలోని బుట్టా రేణుక నివాసంలో ఆమె సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారందరిని పార్టీ విద్యార్థి విభాగం కన్వీనర్ రాకేష్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ రోజురోజుకూ పార్టీపై అభిమానుల వెల్లువ కొనసాగుతుందన్నారు.
తనను ఎంపీగా గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉండి, అందరి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షబానా, ఖైరున్‌బీ, నాగేశ్వరి, భాస్కర్, పెద్ద నర్సింహులు, ప్రసాద్, చాణక్య, అబ్దుల్ రవూఫ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.