కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మలి విడత ప్రచారం బుధవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో మొదటి విడత ఎన్నికలు ఈ నెల 6వ తేదీన పూర్తి కాగా.. ఆదోని డివిజన్‌లోని 17 జెడ్పీటీసీ, 289 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది.
మొత్తం 17 మండలాల్లో 303 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 14 ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 17 జెడ్పీటీసీ స్థానాలకు 71 మంది అభ్యర్థులు, 289 ఎంపీటీసీ స్థానాలకు 869 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గత నెల 24న నామినేషన్ల ఉప సంహరణ అనంతరం నుంచి డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో జోరందుకున్న ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడనుంది.
ఇక ప్రలోభాలపర్వం ఊపందుకోనుంది. డివిజన్‌లో మొత్తం 7,23,140 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 3,60,556.. స్త్రీలు 3,62,584 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు పురుషుల కంటే దాదాపు రెండు వేల మంది ఉండటంతో గెలుపోటముల్లో వీరే కీలకం కానున్నారు. ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. 17 మండలాల్లో 859 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 191 మంది సూక్ష్మ పరిశీలకులను, ఎన్నికల నిర్వహణకు 4,295 మంది సిబ్బందిని నియమించారు.
ఎన్నికలు జరిగే మండలాలు
ఆదోని, పెద్దకడుబూరు, కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, హాలహర్వి, హోళగుంద, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, గోనెగండ్ల.
14 ఎంపీటీసీ స్థానాల్లో 13 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఆదోని డివిజన్‌లో 14 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా, వీరిలో 13 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే కావడం విశేషం. మంత్రాలయం మండలంలోని మంత్రాలయం-2, మంత్రాలయం-3, కాచాపురం, 52.బసాపురం, రాంపురం ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అదేవిధంగా కోసిగి-4, ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల-1, కడిమెట్ల-2, గోనెగండ్ల మండలంలోని కైరవాడి-2, కులుమాల, పెద్దనెలటూరు-1, పెద్దమరివీడు, వేముగోడు ఎంపీటీసీ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ ఖాతాలో చేరిపోయాయి. హొళగుంద మండలం నెరణికి ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.
నేటితో గప్‌చుప్
Published Wed, Apr 9 2014 3:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement