నా ప్రభువే కాపాడాడు | Abdul Khader Jalani Rahmatullah is a great devotee | Sakshi
Sakshi News home page

నా ప్రభువే కాపాడాడు

Published Sun, Jan 6 2019 1:20 AM | Last Updated on Sun, Jan 6 2019 1:20 AM

Abdul Khader Jalani Rahmatullah is a great devotee - Sakshi

హజ్రత్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జీలానీ రహ్మతుల్లాహ్‌ అలైహ్‌ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ‘అబ్దుల్‌ ఖాదర్‌ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్ధం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్‌ గా చేశాము.’ అన్న అదృశ్యవాణి వినిపించింది.అప్పుడు హజ్రత్‌ జీలానీ రహ్మ, ‘హరామ్‌ వస్తువులు హలాల్‌ చేయడం ఎవరికి సాధ్యం? ఇదేమైనా షైతాన్‌ పన్నాగం కాదుకదా..?’ అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్‌ కులేదు.

వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్‌ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’శాపగ్రస్తుడా..దుర్మార్గుడా..దూరంగా పారిపో..’ అంటూ.. అల్లాహ్‌ శరణు వేడుకున్నారు.అప్పుడు షైతాన్‌ మరోపాచిక విసురుతూ..‘జీలానీ . నిన్ను నీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ‘కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు.. నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్‌ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్‌ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది.దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు.

మాసం మహాత్మ్యం
పుణ్యఫలాలనిచ్చే పుష్యం: పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం. పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి బుద్ధి కారకుడు కావడం వల్ల ఈ మాసం బృహస్పతికీ, శనికీ అత్యంత ప్రీతికరమైనది. శనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చే నూనె. కాబట్టి ఈ మాసంలో నువ్వులు, నువ్వులనూనెతో ఆయనను అభిషేకించి, పూజించాలని, నువ్వులు దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్రవచనం. అలాగే ఇది మంచు కప్పబడి ఉండే మాసం కాబట్టి పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ.

ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైలగ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారి, పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ నువ్వులనూనె ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేయడం. అలాగే సంక్రాంతి పిండి వంటలన్నిటిలో నువ్వులు, బెల్లం తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. ఇక ఈ మాసం శూన్యమాసం అని ఆందరూ ఆడిపోసుకుంటారు కానీ, అత్యుత్తమమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదీ, రైతులు పండుగగా, పితృదేవతల పండగగా చెప్పుకునే సంక్రాంతి పండగ వచ్చేది కూడా ఈ మాసంలోనే కాబట్టి చిన్న చూపు తగదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement