ఓటొచ్చిన వేళా విశేషం | After many struggles the women managed to gain the right to vote | Sakshi
Sakshi News home page

ఓటొచ్చిన వేళా విశేషం

Published Fri, Mar 22 2019 12:00 AM | Last Updated on Fri, Mar 22 2019 12:00 AM

After many struggles the women managed to gain the right to vote - Sakshi

ఆకాశంలో సగమైనా అన్నింటా వెలివేతే! అన్ని అవరోధాలనూ అధిగమించి, ప్రతి అడ్డంకినీ ప్రతిఘటించి, చివరకు ఇంటా బయటా అన్నీ తానై నిలిచి,  రణానికీ సైతం సిద్ధపడి,  విశాల ప్రపంచాన్ని శాసిస్తోన్న మహిళల చరిత్ర అంతా నిరాకరణే. ఇక రాజకీయ హక్కుల సంగతి సరేసరి. అసలు ప్రపంచ ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కు  మగువ చేతికి రావడానికే శతాబ్దాలు పట్టింది. 

‘మాటలు కాదు చేతలు కావాలి’ (డీడ్స్‌ నాట్‌ వర్డ్స్‌).. ఇది ఈనాటి ఎన్నికల నినాదం కాదు. 1913లోనే అంటే.. నూటా ఆరు సంవత్సరాల క్రితమే స్త్రీలు పురుషులతో సమానంగా స్త్రీలకూ ఓటు వేసే హక్కు కావాలంటూ బ్రిటన్‌ వీధుల్లో కదం తొక్కిన మహిళల రాజకీయ రణన్నినాదం. శాంతి ప్రదర్శనలూ, నిరసనలూ, ధర్నాలతో దిగిరాని నాటి బ్రిటిష్‌ పాలకులను హడలెత్తించిన మహిళల మహోద్యమమది. తపాలా కార్యాలయాలు తగలబెట్టారు. పోలీసు స్టేషన్లపై రాళ్ల వర్షం కురిపించారు. పాలకుల కార్యాలయాలనూ చుట్టుముట్టారు. సమాచార వ్యవస్థని ధ్వంసం చేశారు. టెలిఫోన్‌ వైర్లు తెంపేశారు. దీనికి నాయకత్వం వహించిన మహిళ ఎమ్మలీన్‌ పంఖస్ట్‌. ఈ మహిళోద్యమంతో బెంబేలెత్తిన పోలీసులు స్త్రీలను ఇళ్లల్లోనుంచి వీధుల్లోకి లాక్కొచ్చారు. అరెస్టుల పాల్జేశారు. ఓటు అడిగినందుకు వారిని మట్టిలో దొర్లించి, గుర్రాలతో తొక్కించారు.

రక్తసిక్తమైన గాయాలతో ఆ పోరాటంలో ఎమిలీ డెవిసన్‌ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అయినా చలించలేదా స్త్రీలు. జైల్లోనే నిరశన దీక్షకు పూనారు. ముద్దముట్టబోమని శపథం చేసారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మహిళల ఓటు హక్కుని నిర్లక్ష్యం చేసినందుకు, మాయమాటలు చెప్పి మహిళలను తరాల తరబడి వంచించినందుకు వందేళ్ల క్రితమే స్త్రీల రాజకీయ చైతన్యాన్ని చవిచూసిన బ్రిటన్‌ కథ ఇది. అయితే ఇది ఒక్కటే కాదు. ఆనాటికే అనేక దేశాల్లో స్త్రీలు ఓటు హక్కుకోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా 170 ఏళ్ల క్రితం స్త్రీల ఓటుహక్కు నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. దాని  పునాదులు అమెరికాలోనే ఉన్నా ఆ తరువాత భారతీయ మహిళలు ‘ఓటు మా హక్కు’ అనే నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.

ప్రాచీన గ్రీస్, రోమన్‌ రిపబ్లిక్‌ తో సహా 18వ శతాబ్దాంతంలో ఆవిష్కృతమైన ప్రజాస్వామ్య దేశాలెన్నో మహిళలకు ఓటు హక్కుని నిరాకరించాయి. 1832లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మహిళల ఓటుహక్కు నిరాకరణ వారసత్వాన్ని కొనసాగించింది. అయితే తొలిసారిగా బ్రిటన్‌లోనూ, అమెరికాలోనూ 19 వ శతాబ్దంలో మహిళల ఓటు హక్కు చర్చనీయాంశంగా మారింది. ఓటు మహిళల ఉద్యమంగా మారింది. అయితే ఏ దేశాల్లో అయితే ఈ ఉద్యమం జరిగిందో ఆ దేశాలు తొలుత మహిళలకు ఓటు హక్కు ప్రసాదిం^è కపోవడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మహిళల హక్కులు ఏవీ మానవహక్కుల్లో భాగం కాలేదు. ఆమాటకొస్తే ఈరోజుకీ అదే పరిస్థితి కొనసాగుతోంది. 

విముక్తితో పాటే ఓటూ!
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అనేక పోరాటాల తరువాత మహిళలు ఓటు హక్కుని సాధించుకోగలిగారు. బ్రిటిష్‌ పాలననుంచి మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే సమయంలోనే స్త్రీలకు ఓటు హక్కుని రాజ్యాంగబద్దం చేసింది. భారత స్వతంత్య్ర సంగ్రామంలోనే స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన మహిళ సరోజినీ నాయుడు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకునే సరోజినీ నాయుడు.. అనీబిసెంట్‌తో కలిసి 1917లో వుమెన్స్‌ ఇండియా అసోసియేషన్‌ స్థాపించారు.

అదే సంవత్సరం స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించాలని  ఆనాటి స్టేట్‌ సెక్రటరీ ఎడ్విన్‌ మాంటెగ్‌కి వినతిపత్రం సమర్పించిన బృందానికి సరోజినీ నాయుడు నాయకత్వం వహించారు. మన దేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం 1900 సంవత్సరంలోనే ఉద్యమం ప్రారంభం అయినా బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్నప్పుడు 1947కి పూర్వం పురుషులకి కానీ, మహిళలకి కానీ సార్వత్రిక ఓటు హక్కు లేదు. విద్య, వ్యాపారాలూ, ఆస్తిపాస్తులూ ఉన్నవారికే ఓటు హక్కు ఉండేది. బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందిన తరువాత 1950లో మన దేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించారు. 1950లో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వజనీన ఓటు హక్కు ద్వారా స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఓటు హక్కు సాధ్యమయ్యింది. 

మహిళలకు ఓటేసిన శతాబ్దం
ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు వేసే అవకాశం వచ్చింది 20 శతాబ్దంలోనే. ఒక్క 1893లో మాత్రం న్యూజిలాండ్‌ జాతీయ ఎన్నికల్లో మహిళ తొలిసారిగా తన ఓటు హక్కుని వినియోగించుకుంది. ఆ తరువాత 1902లో ఆస్ట్రేలియా, 1906లో ఫిన్‌లాండ్, 1913లో నార్వే మహిళలకు ఓటు హక్కు ఇచ్చాయి. స్వీడన్‌లోనూ, అమెరికాలోని స్థానిక ఎన్నికల్లో మహిళలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1914–39 సంవత్సరాల మధ్య కాలంలో మరో 28 దేశాల్లో నేషనల్‌ ఎలక్షన్స్‌లో స్త్రీలు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అందులో సోవియట్‌ రష్యా కూడా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, యుగోస్లేవియా, చైనా దేశాలు స్త్రీల ఓటు హక్కుని ఆమోదించాయి.

మన తరువాత ఆరేళ్లకు పాకిస్తాన్‌లో 1956లో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఇక ప్రపంచంలో మహిళల ఓటు హక్కుని ఆమోదించిన దేశాల సంఖ్య 100 కు చేరడానికి మరో దశాబ్దకాలం పట్టింది. 1971లో స్విట్జర్లాండ్‌ పాక్షికంగా స్త్రీలకు ఓటు వేసే అవకాశాన్నిచ్చింది. 1973లో సిరియా పూర్తిస్థాయిలో స్త్రీల ఓటు హక్కుని ఆమోదించింది. అయితే అనేక అరబ్‌ దేశాల్లోనూ, పర్షియన్‌ గల్ఫ్‌ దేశాల్లోనూ, సౌదీ అరేబియాలాంటి అనేక సాంప్రదాయ వాద దేశాల్లోనూ చాలా కాలం మహిళల ఓటు హక్కు నిరాకరణకు గురయ్యింది. తొలిసారిగా 2015లో సౌదీలో మహిళల ఓటు హక్కును ఆమోదించారు. తొలిసారి అక్కడి మహిళలు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసారు. మహిళల రాజకీయ హక్కులపై జరిగిన యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌లో ఎటువంటి వివక్షకూ అవకాశం లేకుండా పురుషులతో సమానంగా స్త్రీలకు సైతం ఓటు హక్కు ఉండాలని 1952లో జరిగిన తీర్మానం కూడా ఈ మార్పుకు తోడ్పడింది.
– అత్తలూరి అరుణ

పేద మహిళల కోసంక్లారా ఓటు పోరాటం
స్త్రీ పురుష సమానత్వం కోసం, ప్రపంచ స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తిన జర్మనీకి చెందిన సోషలిస్టు, కమ్యూనిస్టు క్లారా జెట్కిన్‌. స్త్రీ విముక్తి పోరాటాలెన్నింటికో నాయకత్వం వహించిన క్లారాజెట్కిన్‌ శ్రామిక మహిళల పోరాటదినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని తొలిసారి ప్రకటించిన పోరాటయోధురాలు. యూరప్‌ సంపన్న వర్గ మహిళలు, నాటి ఫెమినిస్టులు ఆస్తి ప్రాతిపదికగా ఇచ్చే స్త్రీల ఓటు హక్కుని ఆమోదించారు. అయితే రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మిక వర్గ స్త్రీల ఓటు హక్కుని గురించి మాట్లాడకపోతే ఈ ఉద్యమానికి అర్థం లేదని క్లారా వాదించారు. అందుకే ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అందరు స్త్రీలతో పాటు పేద కార్మికవర్గ స్త్రీలకు సైతం ఓటు హక్కు కోసం క్లారా గళమెత్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement