ఇద్దరు పిల్లలకు తల్లి. ఎవ్వరూ నమ్మరు. నిజమో? కాదో? అయినా నమ్మించింది. తరచూ ఇండస్ట్రీ గ్లామర్‌ను తెచ్చుకునిదానికి నటన నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిని చూడండి నటనకు గ్లామర్ నేర్పించింది. నటికి నటనే ఐశ్వర్యం అనిపించింది.
తమిళంలో ఆల్రెడీ మీరు స్టార్ హీరోయిన్. కానీ తెలుగులో కొత్త హీరోయిన్‌గా మొదలుపెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది.
పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే బేసిగ్గా నా మాతృభాష తెలుగు. కానీ, నేను పుట్టి, పెరిగింది, స్కూల్, కాలేజ్ అంతా చెన్నైలో. నాన్నగారు(రాజేష్) ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు తెలియడం వల్ల ఈ ఇండస్ట్రీ కొత్త అనే భావన కలగలేదు.
చెన్నైలో పుట్టి, పెరిగారు కదా. కొందరు మరచిపోతారు లేదా స్పష్టంగా మాట్లాడలేరు..
ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. బయట తమిళ్‌లో మాట్లాడతాను. అది కూడా చాలా ఫ్లూయెంట్‌గా. చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల తెలుగుతో పోలిస్తే తమిళ్ చాలా బాగా మాట్లాడతా
తమిళంలో చేసిన ‘కణా’ను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ చేస్తున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్?
తెలుగులో భీమనేని శ్రీనివాస్‌గారు డైరెక్ట్ చేశారు. ఆయన రీమేక్ కింగ్. మనందరికీ తెలుసు. పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు హీరోయిన్లంటే ఫేస్‌లో కొంచెం అందంగా కనిపించాలనే ఫీలింగ్ ఉంది. అలా కాకుండా న్యాచురల్‌గా చేశాను. సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్‌ని చూసినట్టు ఉండదు.. కౌసల్య పాత్రని మాత్రమే చూస్తారు.
తెలుగు తెలుసన్నారు. డబ్బింగ్ చెప్పుకున్నారా?
నేనే డబ్బింగ్ చెప్పాను. చాలా తమిళ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నేను ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాకి చెబుతుంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కానీ, చాలా బాగుంది. తెలుగులో నేను ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నా. విజయ్ దేవరకొండ సినిమాలో నా పాత్ర తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడాలి. అది డబ్బింగ్ చెప్పడం నాకు ఇంకా చాలెంజింగ్‌గా ఉంటుందనుకుంటా.
క్రికెట్టంటే మెన్‌గేమ్ అన్నట్టుంటుంది. మరి ఫీమేల్ క్రికెటర్‌గా నటించడం చాలెంజింగ్‌గా ఉందా?
కచ్చితంగా. అందుకే నేను ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నా. క్రికెట్ చూస్తాను. కానీ ఎప్పుడూ బ్యాట్, బాల్ పట్టుకుంది లేదు. ఈ సినిమా కోసం కార్క్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేశా. ఆ బాల్ చాలా హార్డ్‌గా ఉంటుంది. టెక్నిక్‌తో ఆడాలి. అది తెలియక దెబ్బలు తగిలించుకున్నా కూడా. ప్రాక్టిస్‌లో బౌలింగ్‌పై చాలా శ్రద్ధ పెట్టా. ‘కణ’ చిత్రానికి కంప్లీట్‌గా ఆరు నెలలు ప్రొఫెషనల్‌తో ట్రైనింగ్ తీసుకున్నా. సిన్సియర్‌గా చేశా.
ఫీమేల్ సెంట్రిక్ మూవీని క్యారీ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా?
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అందరికీ దొరకదు. దొరికినా మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరం. ఒక హీరోలాగా.. హీరోయిన్ స్క్రీన్‌పై కనిపించగానే కింద ఉన్నవాళ్లంతా అరుస్తున్నారంటే అదే స్టార్ వ్యాల్యూ. ఒకమ్మాయి తెరపై కనిపిస్తే ఎంత స్పందన వస్తుంటే అంత స్టార్ వ్యాల్యూ ఉన్నట్టు. ఒక హీరోయిన్‌కి ఓపెనింగ్స్ ఉండాలంటే తను పెద్ద స్టార్ అయ్యుండాలి. నేను ఇండస్ట్రీకొచ్చిన ఆరేళ్లలో చాలా సినిమాలు చేశా. ఈ అమ్మాయి మంచి పాత్రలు చేస్తుందన్నది నా ప్రత్యేకత.. ఈ అమ్మాయి మీద పెట్టుబడి పెడితే తిరిగి వస్తుందనిపించుకున్నప్పుడే మనం ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేయాలి. ‘కణా’ తో ఐశ్వర్యా రాజేష్ అంటే మంచిగా చేస్తుంది, డబ్బులు కూడా వస్తాయని పేరొచ్చింది. దాని తర్వాత నేను చెత్త సినిమాలు చేస్తే కరెక్ట్ కాదు. నేను కూడా స్మార్ట్‌గా మూవ్ చేయాలి.
హీరోయిన్స్ సినిమాను సింగిల్‌గా లాగేస్తున్నప్పటికీ, హీరో, హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్ తేడా చాలా ఉంది కదా... మీరెలా ఫీలవుతున్నారు?
ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. తెలుగు, తమిళ సినిమా ఏదైనా అంతే. కానీ, హిందీ సినిమా అలా కాదు. దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్‌కి హెవీగానే ఇస్తున్నారు. వారు 15, 20 కోట్లు వసూలు చేస్తున్నారు ఇంచుమించు హీరోలతో సమానంగా. ఎందుకంటే వాళ్లు చాలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయి, బిజినెస్ ఉంది. అలా కూడా మన ట్రెండ్ మారితే బావుంటుంది. ఇప్పుడు నయనతారకి 5 కోట్లు ఇస్తున్నారంటే రెమ్యూనరేషన్ పెంచినట్టే కదా. హిందీలో ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, సోనమ్ కపూర్.. ఇలా అందరూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వాళ్లకీ బిజినెస్ ఉంది. వ్యాపారాన్ని బట్టే కదా రెమ్యునరేషన్ ఇస్తారు.
క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడుతున్నారు.. భవిష్యత్తులో నిర్మాత అయ్యే ఆలోచనలున్నాయా?
అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిర్మాత అవ్వాలంటే మనకి ఆర్థిక స్థోమత ఉండాలి. నిర్మాత జాబ్ అంత ఈజీ కాదు. దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం.
మీ సినిమాలను గమనిస్తే గ్లామర్ సైడ్ వెళ్లకుండా ట్రెడిషనల్ రోల్సే ఎక్కువ చేశారు.
అదేం లేదు. నాకు ఏది సరిపోతుందో ఆ పాత్రలు చేస్తా. నాకు కూడా ప్రయోగాలు చేయాలని ఉంది, భవిష్యత్తులో చేస్తా. గ్లామర్ పాత్రలంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. గ్లామర్‌కీ వల్గర్‌కి ఓ చిన్న లైన్ ఉంది. చూసినప్పుడు అందంగా కనిపిస్తే గ్లామర్ అంటారు.. చూసిన వెంటనే ‘అబ్బ.. ఏందిరా ఇది’ అంటే అది వల్గర్ అన్నమాట. ఎలాంటి గ్లామర్ నాకు సూట్ అవుతుందన్నది ఫస్ట్ నాకు తెలియాలి... దాన్నే గ్లామరస్ అంటారు. నా క్యారెక్టర్స్ వరకూ అన్నీ తల్లిగా, చెల్లిగా, స్కూల్ అమ్మాయిగా చే శా. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో 16 ఏళ్ల అమ్మాయిగా చేశాను.
హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువ. కెరీర్ పీక్‌లో ఉండగానే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటారు...
మా అమ్మ కూడా అలాగే అంటారు. పెద్దవారి ఆలోచన విధానం అంతే. అలా అనుకోకపోతేనే తప్పు. అంటే వారి అనుభవం అలాంటిది.
మరి మీకేమైనా భయంగా అనిపించిందా?
అలా ఏం లేదు. నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నా పనిని నమ్ముతాను.. నాపైన నమ్మకం ఉంది. అయితే చాలామంది కామెంట్స్ చేస్తుంటారు.. నువ్వేంటి హీరోయిన్... నీ బొంద? అని...(నవ్వు)
డైరెక్ట్‌గా మిమ్మల్ని అనేవారా? అప్పుడు మీకెలా అనిపించింది?
ఇన్‌డైరెక్ట్‌గా అనేవారు. నేను వెళ్లి కలిసినప్పుడు ఫ్రెండ్ రోల్, సిస్టర్ రోల్ ఇస్తాం అనేవారు.. అంటే వాళ్లది తప్పు అని చెప్పలేం. నాకు 18,19 ఏళ్ల టైమ్‌లోనే వెళ్లా. అప్పుడు బట్టలు కూడా సరిగ్గా వేసుకోవడం రాదు.. సరైన మేకప్ వేసుకోవడం రాదు. తలకి నూనెపెట్టుకుని వెళితే డైరెక్టర్లు అలాగే అంటారు కదా? హీరోయిన్లంటే గ్రూమింగ్స్ అని వేరుగా ఉంటాయి. బాంబే నుంచి అమ్మాయిలు వస్తే వాళ్ల పెరిగిన విధానం వేరుగా ఉంటాయి.. మనది వేరు. వాళ్లు కొంచెం ఫాస్ట్ అన్నమాట. షార్ట్స్, టీ షర్ట్స్‌తోనే ఉంటారు వాళ్లు. చాలా బ్రాడ్, సిటీ లైఫ్, మెట్రో లైఫ్. మనకు తెలీదప్పుడు.
మరి ఆ బాధను ఎవరి వద్ద చెప్పుకున్నారు?
ఎవరి వద్దా చెప్పలేదు.. నాకు నేను చెప్పుకున్నాను. ప్రతిరోజూ నిద్రపోయేముందు నేను హీరోయిన్ అవ్వాలి అని వందసార్లు చెప్పుకునేదాన్ని.
‘మీటూ’ అని వింటున్నారు కదా? అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా...?
మీటూ... నేను ఎలాంటి అమ్మాయినంటే నావద్దకొచ్చి ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొట్టే రేంజ్ నాది. బేసిక్‌గా నేను చాలా బోల్డ్‌గా ఉంటాను. నన్ను ఇంట్లో అలా పెంచారేమో?
అలా అందరూ ఉండాలంటే బాగా తెలివితేటలు ఉండాలి కదా?
ఇప్పుడొచ్చే అమ్మాయిలకు చెప్పనవసరం లేదు. చాలా తెలివిగా ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి నాకు తెలిసిన తర్వాత కడిగే చేపలో స్లిప్ అయ్యే చేపలాగా ఉంటానన్నమాట(నవ్వుతూ). ఎవరైనా పార్టీ ఉందంటూ ఆహ్వానిస్తే హైదరాబాద్ వెళుతున్నా, బాంబే వెళుతున్నా అంటూ తప్పించుకోవడమే. నెక్ట్స్ టైమ్ పిలిస్తే అయ్యో నేను ఊర్లో లేనే! అంటుంటాను. అలా ఉండాలంతే!
మీకు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా? మీ తాతగారు, నాన్నగారిని చూస్తూనే పెరిగారు కదా? అప్పుడు షూటింగ్‌లకు వెళ్లేవారా?
లేదండి.. నాకు పదేళ్లున్నప్పుడే నాన్నగారు చనిపోయారు. నేను పుట్టినప్పటికే నాన్నగారు సినిమాల్లోంచి ఔట్ అయినట్టున్నారు. ఆల్‌మోస్ట్ నాకు నాలుగైదేళ్లు ఉన్నప్పుడే.. చాలా బ్యాడ్ సర్కిల్ ఆయనది. చాలా ఉన్నాయి ఆ కథలు ఇప్పుడెందుకులే. తాతగారి గురించి అస్సలు తెలియదు. శ్రీలక్ష్మిగారంటే హైదరాబాద్‌లో ఉండేవారు. శ్రీలక్ష్మిగారి తమ్ముడి కూతుర్ని నేను.
మణిరత్నంగారితో(నవాబ్) సినిమా చేయడం ఎలా అనిపించింది? తక్కువ టైమ్‌లోనే ఆ అవకాశం వచ్చిందనుకుంటా?
రియల్లీ... చాలా వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అయితే, తక్కువ టైమ్ ఏమీ కాదు ఆరేళ్లు అయ్యింది కదా(నవ్వుతూ). నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన బ్యానర్‌లో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. ఇందులో కథ మణిసార్‌ది. దర్శకత్వం వేరే అబ్బాయి చేస్తున్నాడు.
మీ చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉన్నాయి కదా?
‘కాకా ముటై్ట’ చిత్రం చేసిన తర్వాత ఏడాదిన్నర సినిమాలు లేవు. ‘కాకా ముటై్ట’ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా చేశా. అప్పుడు నాకు 21ఏళ్లు. ఆ సినిమా నాకు ప్రపం^è వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. దానివల్లే నాకు హిందీ, మలయాళం సినిమాల్లో అవకాశాలొచ్చాయి.. ఒక నటిగా నేను ఎస్టాబ్లిష్ అయ్యానంటే ‘కాకా ముటై్ట’తోనే. ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా చూస్తే ‘కాకా ముటై్ట’లో అమ్మగా నటించింది నువ్వే కదా? అంటారు.
తల్లి పాత్ర చేయడం బ్యాడ్ అయిందనిపించిందా?
అలాంటిదేం లేదు.. పేరు బాగా వచ్చింది. దాని తర్వాత దుల్కర్ సల్మాన్‌తో సినిమా వచ్చింది. ‘అందమైన జీవితం’ అని తెలుగులో డబ్బింగ్ చేశారు. చాలామంది యూ ట్యూబ్‌లో చూశారు. దుల్కర్ సల్మాన్, నివిన్ పాలి, అర్జున్ రాంపాల్, ధనుష్‌తో చేశా. ‘సగవ్’ అనే సినిమాలో 65–70 ఏళ్ల వృద్ధురాలి గెటప్ వేశా. ఫ్లాష్‌బ్యాక్‌లో చిన్న పిల్లగానూ చేశా. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు.
తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం?
జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం.. ఇక్కడున్న వారందరూ ఇష్టమే. కానీ, ఎందుకో జూ.ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు చూస్తాం. మా ఇంట్లో నా సొంత అన్న ఉన్నాడులే. వాడికి జూ.ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయన యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ సూపర్బ్. డ్యాన్స్ ఎంతో∙గ్రేస్‌తో చేస్తారాయన. అందుకే ఆయనంటే నాకిష్టం. ఆయనతో ఓ సినిమా చేస్తే హ్యాపీ.
‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో మేకప్ లేదను కుంటా?
లేదు. కాకపోతే గ్రౌండ్‌లో ఎండలో నిల్చోబెట్టారు కాబట్టి నల్లగా అయిపోయా. మేకప్ వేసినా, వేయకున్నా ఒకటే.
టీత్ మీరు లక్కీ అనుకుని ఉంచారా? లేకపోతే ఏంటి?
లక్కీ అనేం లేదు. అది తీస్తే మొత్తం సెట్ చేయడానికి ఆర్నెళ్లు పడుతుందన్నారు. బాగానే ఉంది. తీసుకోవడానికి టైమ్ లేదు. అందుకని అలాగే వదిలేశా.
మీ డ్రీమ్‌రోల్స్ ఏంటి?
నా డ్రీమ్‌రోల్స్ అంటూ ఏమీ లేదు. ఏ పాత్ర వచ్చినా కూడా ఇదే నా డ్రీమ్ రోల్, చాలా బాగా చేయాలనుకుంటాను. (నవ్వు)
Comments
Please login to add a commentAdd a comment