హోమియో కౌన్సెలింగ్
మా బాబుకు పదేళ్లు. వాడికి పొట్టమీద , చర్మం మీదా ఎర్రగా గుండ్రంగా మచ్చలు ఏర్పడ్డాయి. ఆ మచ్చలు దురద అని ఏడుస్తున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే ఎగ్జిమా అని చెప్పారు. అంటే ఏమిటి? ఇది ఎలా తగ్గుతుంది? సలహా చెప్పగలరు.
- పుష్పలత, హైదరాబాద్.
నూటికి 90 శాతం మంది ఏదో ఒక సాధారణ చర్మవ్యాధితో బాధపడుతూనే ఉంటారు. మీ బాబుకు వచ్చిన వ్యాధి గురించి మీరు ఆందోళన పడకండి. మందులు వాడితే నయం అవుతుంది.
ఎగ్జిమాను తెలుగులో తామర అంటారు. ఎగ్జిమాలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా కనిపించే అటోపిక్ ఎగ్జిమాతో ఎక్కువమంది బాధపడుతుంటారు. శిశువులలో 55 శాతం, ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో 85 శాతం, ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య పెద్ద వయసు వారిలో కూడా కనిపిస్తుంది. శరీరంలో ఎక్కడయినా ఏర్పడే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా మోకాలు వెనుక భాగం, మోచేయి, మణికట్టు మడతలలో, మెడపైన, కాలి మడమలు, పాదాలపైన కనిపిస్తాయి.
ఎగ్జిమా రకాలు: అలర్జిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్, అటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, నమ్యులార్ డర్మటైటిస్, స్టేనిస్ డర్మటైటిస్, డిస్ హైడ్రాయ్‌టిక్ ఎగ్జిమా.
కారణాలు: ఎక్కువగా పొడిచర్మం, ఏదైనా అలర్జీ కలిగించే వస్తువులు తగిలినప్పుడు, కొన్ని రసాయనాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితి నుంచి ఎక్కువగా ప్రతిక్రియ జరపడంతో ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తాయి.
ప్రేరేపకాలు: వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, జంతుకేశాలు, కొన్ని ఆహార పదార్థాలు, డిటర్జెంట్లు, చేతిగడియారాలు, ఇమిటేషన ఆభరణాలు, డయాపర్లు, డియోడరెంట్లు, ఉన్నివస్త్రాలు, ఇవేకాకుండా దురద పుట్టించే కొన్ని పదార్థాలు దీనిని తీవ్రతరం చేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా ఎగ్జిమా ఎక్కువయే అవకాశం ఉంది.
లక్షణాలు: ప్రధాన లక్షణం దురద. దీంతో చర్మం కమిలిపోయి ఎరుపు రంగుకు మారటం, ఆ తర్వాత చర్మం పైన వాపుతో కూడిన పొక్కులు ఏర్పడటం, క్రమేణా అవి నీటిబుడగలుగా మారి వాటినుంచి రసి కారటం, కొంతకాలానికి చర్మం దళసరిగా, నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శిశువుల లో మొదట బుగ్గలపై దద్దుర్లుగా కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఇవే దద్దులు చేతులు, కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలకూ పాకుతాయి.
నివారణ, హోమియో చికిత్స: పైన చెప్పిన వస్తువులు, పరిస్థితులకు దూరంగా ఉండటం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు. హోమియోకేర్ అందించే కాన్‌స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధిని నివారించడమే కాకుండా భవిష్యత్తులో ఈ ఎగ్జిమాను ప్రేరేపించే వస్తువులను ఉపయోగించినా మళ్లీ ఈ వ్యాధి సోకకుండా పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మా అమ్మకు, నాన్నకు ఇద్దరికీ గుండెసమస్యలు ఉన్నాయి. నాకు కూడా వచ్చే అవకాశాలున్నాయేమో అని భయంగా ఉంది. గుండెపోటు రావడానికి కారణాలు, చికిత్సా విధానాలు తెల్పగలరు.
- కె.కిరణ్ కుమార్, పీలేరు
గుండెసమస్య ఎవరికైనా రావచ్చు. ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొవ్వుశాతం, స్థూలకాయం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత మొదలైనవి. సాధారణంగా రక్తనాళాల లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు మందుల ద్వారా లేదా ఆంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. శరీరంలో అధిక కొలెస్టరాల్ వల్ల వచ్చే అనర్థాలు, రక్తనాళాలలో కొవ్వు చేరడం వల్ల, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలైన 2డీ ఎకో, టి.ఎం.టి. కొలెస్టరాల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె కండరాలు, గుండె పనితీరు తెలుస్తుంది. గుండెలో రక్తనాళాలలో అడ్డంకులు ఉంటే దీనికి ఆంజియోప్లాస్టీ అవసరం. ఆంజియోప్లాస్టీ అంటే సూక్ష్మనాళాన్ని మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపి, తర్వాత సన్నటి వైరు వంటి దాని సాయంతో రక్తనాళాలలోని కొవ్వును తొలగిస్తారు. అవసరాన్ని బట్టి అక్కడ స్టంట్‌ను అమర్చడం ద్వారా ఆంజియోప్లాస్టీ చికిత్స పూర్తవుతుంది. రక్తనాళాలలో ఉన్న అడ్డంకిని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీన పడకుండా ఉంటాయి.
నా వయసు 68. నాకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్‌గారు నాకు వాల్యులో ప్లాస్టీ చికిత్స అవసరమని సూచించారు. దయచేసి వివరించగలరు.
- కె.వి.రావ్, కోదాడ
గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులో ప్లాస్టీ అంటారు. గుండెకు ఎడమపక్కన ఉన్న మిట్రల్ కవాటం మూసుకుపోయినప్పుడు దాన్ని వాల్వులోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్ సాయంతో వెడల్పు చేస్తారు. పల్మునరీ వాల్వులోప్లాస్టీ- పిబీపీవో- గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం పల్మునరీ వాల్వ్ అంటారు. ఈ పల్మునరీ వాల్వ్ మూసుకుపోయినప్పుడు బెలూన్ ద్వారా దీన్ని తెరవవచ్చు. ఇది సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపం కాబట్టి దీన్ని చిన్న వయసులోనే సరిచేయవచ్చు.
పి.బి.ఎ.వి. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకు వెళ్లే ధమనికి ఉన్న కవాటం అమోర్టిక్ కవాటం మూసుకుపోయినప్పుడు ఈ పద్ధతి ద్వారా సరి చేస్తారు. మీరు భయపడకండి.
డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 27. గర్భం ధరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే నాకు చాలాసార్లు గర్భస్రావం అయ్యింది. ఎనిమిది వారాల గర్భం అప్పుడు ఒకసారి, పదకొండు వారాలకు ఒకసారి, తొమ్మిది వారాల టైమ్‌లో ఇంకోసారి గర్భస్రావం అయ్యింది. ఇక ఎనిమిది వారాల సమయంలో నాలుగోసారి కూడా గర్భస్రామైంది. దాంతో నాకు తీరని నిరాశకు లోనవుతున్నాను. నేను బిడ్డ పుట్టే అవకాశాలు లేవేమోనని ఆందోళనకు గురవుతున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- ఒక సోదరి, విజయవాడ
ఒకసారి గర్భస్రావం అయ్యిందంటే అది సాధారణంగా పరిగణించవచ్చు. కానీ మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు అదే జరిగితే వాటిని తరచూ జరిగే గర్భస్రావాలని (రికరెంట్ మిస్‌క్యారేజ్) భావించాలి. అసలు మీ సమస్యకు కారణం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీ లేఖలో మీ వయసెంతో పేర్కొనలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అండంలో నాణ్యత కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 20-24 వయసు వారిలో గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు 11 శాతం మాత్రమే ఉంటాయి. అదే 40-44 ఏళ్ల వయసు వారిలో అది 50 శాతం ఉంటాయి. వయసుతో పాటు పెరిగే బరువు కూడా గర్భస్రావాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి మీరూ, మీ భర్త ఇద్దరూ క్రోమోజోమ్ విశ్లేషణ పరీక్షలు చేయించుకోవాలి. దీనితో పాటు ఒకసారి మీరు థైరాయిడ్, డయాబెటిస్ పరీక్షలూ చేయించుకోండి. మీ గర్భసంచి ఎలా ఉందో తెలుసుకోడానికి హిస్టరోస్కోపీ లేదా లాపరోస్కోపీతో పాటు చేసే హిస్టెరోస్కోపీ 3-డీ స్కానింగ్ చేయించండి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే, దానికి తగిన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీకు ఏ సమస్యా లేకపోతే అందరిలాగే మీరూ గర్భవతి అయ్యేందుకు, పండంటి బిడ్డ పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్,
రోడ్ నెం. 1, బంజారాహిల్స్,
హైదరాబాద్
మా పేరెంట్స్‌కు గుండెసమస్యలు... నాకు కూడా వస్తాయా?
Published Tue, Jan 26 2016 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement