తపంచా.. తివాచీలో చుట్టిన శవం.. అక్కడ ఇవే..! | Amazon Prime Production Web Series It | Sakshi
Sakshi News home page

బ్లడ్‌ కార్పెట్‌

Published Sat, Nov 24 2018 12:14 AM | Last Updated on Sat, Nov 24 2018 1:18 AM

Amazon Prime Production Web Series It - Sakshi

యు.పి.లో ఉన్న మీర్జాపూర్‌రెండు విషయాలకు ఫేమస్‌.ఒకటి కార్పెట్‌. రెండోది బ్లడ్‌ కార్పెట్‌. చేతిలో తపంచా.. తివాచీలో చుట్టిన శవం..ఇక్కడ తరచు కనిపించే దృశ్యాలు.మీర్జాపూర్‌లాగే.. మనిషిలోనూ రెండు ఉంటాయి. ఒకటి నిజాయితీ. రెండోది కుట్ర. కుట్రలో నిజాయితీని చుడితే నిజాయితీ కనిపించదు.నిజాయితీలో కుట్రను చుడితే కుట్ర కనిపించదు.కనబడినా, కనబడకపోయినా మీర్జాపూర్‌ మనిషిలో  రెండూ ఉంటాయి. 

ఫ్యాక్షన్, వయొలెన్స్, వైవాహిక అసంతృప్తులు, వారసత్వ అధికారాల కోసం ఆరాటం.. అలక, పగ, కుట్ర.. ఇవన్నీ ‘మీర్జాపూర్‌’లో కనిపిస్తాయి. 
మీర్జాపూర్‌.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఊరు. ఆ ఊరి పేరుతో..అమెజాన్‌ ప్రైమ్‌ ప్రొడక్షన్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. 
దర్శకత్వం: కరణ్‌ అన్షుమన్‌
ముఖ్య తారాగణం: పంకజ్‌ త్రిపాఠి (అఖండానంద్‌), దివ్యేందు (మున్నా), రసిక (బీనా). 

అఖండానంద్‌ వ్యాపారస్తుడు. మీర్జాపూర్‌లో తివాచీలు తయారు చేసే పరిశ్రమను నడిపిస్తుంటాడు. రంగురంగుల అందమైన తివాచీల కింద ఇంకో కర్మాగారమూ పనిచేస్తుంటుంది. ఆయుధాల ఫ్యాక్టరీ.  ఆయన ప్రధాన ఆదాయ వనరు అదే. అక్కడ తుపాకీలను తయారు చేయించి అక్రమ రవాణా చేస్తాడు. తనూ ఉపయోగించుకుంటాడు. ఆ ఊళ్లో అఖండానంద్‌ అంటే టెర్రర్‌. ఎవరూ అతని జోలికి వెళ్లరు. ఆ కళ్లకు ఎదురుపడరు. ఆ నోటికి అడ్డుపడరు. స్వతహాగా అఖండానంద్‌ చాలా తక్కువ మాట్లాడ్తాడు. ఇషారాతోనే పని చేయించగల సమర్థుడు. అతనికి ఒక కొడుకు మున్నా (దివ్యేందు).  ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ. గన్‌ అంటే అతనికి ఆటవస్తువు. ప్రాణాలంటే చెలగాటమే. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను,  ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ను వెంటేసుకుని తిరుగుతుంటాడు.  ఆఖరికి కాలేజ్‌కి కూడా ఆ ముగ్గురి తోడుతోనే వెళ్తాడు. డ్రగ్స్, మందు, అమ్మాయిలు ఏదైనా అంతే. వాటితోనే అతని ఉనికి.  అఖండానంద్‌ భార్య రసిక. అఖండానంద్‌కు ఆమె రెండో భార్య. మున్నాకు పిన్ని. కానీ అలా పిలిపించుకోవడం రసికకు ఇష్టం ఉండదు. అలాగని ‘అమ్మా’ అని పిలిచీ తనను పెద్దదాన్ని చేయొద్దు అంటుంది. అందుకే అసలు మాటే మాట్లాడడు మున్నా.. ఎప్పుడో అవసరమైతే తప్ప. రసిక పుట్టింటి పేదరికం వల్ల తనకన్నా వయసులో చాలా పెద్దవాడు, బాగా ఆస్తి ఉన్న అఖండానంద్‌ను పెళ్లి చేసుకుంటుంది.. పుట్టింటిని బాగుపర్చాలనే ఆశతో. ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది కూడా. అఖండానంద్‌ తండ్రి కుల్‌భూషణ్‌ ఖుర్బందా. అఖండానంద్‌ చిన్నప్పుడు జరిగిన ముఠా తగాదాలో గాయపడి జీవితాంతం వీల్‌చైర్‌కే అంకితం అవుతాడు. 

మీర్జాపూర్‌లో అఖండుడు
నేర చరిత్రతో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా మీర్జాపూర్‌లో బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు అఖండానంద్‌. ఇవన్నీ తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నా.. తండ్రిని మించి ఎదుగుతాడు. తర్వాత తరం అయిన మున్నా కూడా అలాగే ఎదగాలనీ ఆశిస్తుంటాడు అఖండానంద్‌. కానీ మున్నాలోని ఆవేశం అతనిలోని విచక్షణను చంపేస్తుంటుంది. పైగా వారసత్వంగా అబ్బిన అధికారదర్పం మున్నాలో ఆలోచనను పుట్టనివ్వదు. అలాంటి ప్రవర్తనతోనే ఒకసారి ఓ పెళ్లి బారాత్‌ (ఊరేగింపు)లోకి వెళ్లి డ్యాన్స్‌ చేస్తూ మద్యం, డ్రగ్స్‌మత్తులో అత్యుత్సాహపడుతూ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతాడు. ఆ తుపాకి గుళ్లకు గుర్రం మీదున్న పెళ్లికొడుకు చనిపోతాడు. ఆ ఘనకార్యానికి సంబరపడి ఆ రాత్రి మళ్లీ పార్టీ చేసుకుంటాడు మున్నా. 

ప్రత్యర్థులూ తక్కువేం కాదు
ఆ కేసును వాదించడానికి ఒప్పుకుంటాడు రమాకాంత్‌ అనే ఓ లాయర్‌. నిజాయితీగా బతకాలనే ఆరాటం తప్ప అతిగా ఆశ, ఆస్తిలేని మధ్యతరగతి మనిషి. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు గుల్లూ, బబ్లూ. ఒక కూతురు. తుపాకీని చూడ్డం.. వాడ్డం ఈ కుటుంబానికీ అలవాటే. పెళ్లికొడుకును చంపిన కేసును రమాకాంత్‌ టేకప్‌ చేశాడని తెలిసి వాపస్‌ తీసుకోమని హెచ్చరించడానికి వెళ్తాడు మున్నా.. తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో. అప్పుడే తెలుస్తుంది ప్రేక్షకులకు రమాకాంత్‌ కుటుంబం కూడా గన్స్‌తో బాగా ఆడుకుంటుందని. హెచ్చరికలో భాగంగా ఆ ఇంటిల్లిపాదిని భయపెట్టేందుకు తుపాకీ ఎక్కుపెడ్తాడు మున్నా. వెంటనే రమాకాంత్‌ గన్‌ తీస్తాడు. కాల్పుల గేమ్‌ మొదలవుతుంది. ఆ ఆటలో రమాకాంత్‌ భార్య, కూతురు పిస్తోలు పేలుస్తారు. చావు తప్పి చెవి తెగిన మున్నా.. అనుచరుడిని తీసుకుని ఇంటికి పారిపోతాడు. విషయం తెలుసుకున్న అఖండానంద్‌.. మున్నాను కొట్టిన రమాకాంత్‌ కొడుకులిద్దరినీ ఇంటికి పిలిపిస్తాడు. 

ఒకడు జెమ్‌.. ఒకడు జిమ్‌
రమాకాంత్‌ కొడుకులు ఇద్దరిలో ఒకడు చదువులో జెమ్‌. ఇంకొకడికి జిమ్‌ పిచ్చి. 24 గంటలూ బాడీ బిల్డింగ్‌ మీదే ధ్యాస. చదువంటే బోర్‌. గ్యాంగ్‌స్టర్‌ కావాలనుకుంటుంటాడు. రమాకాంతేమో కొడుకులను సివిల్స్‌కి ప్రిపేర్‌ చేయడం కోసం నానాతంటాలు పడ్తుంటాడు. ఇంటికి పిలిపించుకున్న అఖండానంద్‌ ఆ అన్నదమ్ములిద్దరి యాటిట్యూడ్, ఎవరికీ వెరవని తనం చూసి.. వాళ్లముందు ఒక ఆఫర్‌ పెడ్తాడు. ఆ క్షణం నుంచి తనకు పనిచేయమని. అయిదు నిమిషాల తర్జనభర్జన తర్వాత సరే అంటారు. వాళ్లకు రెండు  తుపాకులు,  ఒక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండీ ఇస్తాడు అఖండానంద్‌. బాడీ బిల్డింగ్‌ అంటే పిచ్చి ఉన్నవాడు పండుగ చేసుకుంటాడు వాటితో. ఆ తెల్లవారి నుంచే ఆ ఇద్దరూ అఖండానంద్‌ వ్యాపారాల్లో, పనుల్లో.. నేరాల్లో భాగస్వాములవుతారు. ఈ విషయం తెలిసిన రమాకాంత్‌ మండిపడ్తాడు. వద్దని వారిస్తాడు. అయినా వాళ్లు వినకపోగా మున్నాకు వ్యతిరేకంగా వాదిస్తున్న కేస్‌ను తిరిగి వెనక్కి తీసుకోమంటారు. ససేమిరా అంటాడాయన. అటునుంచి నరుక్కు రావడానికి చనిపోయిన పెళ్లికొడుకు పేరెంట్స్‌ దగ్గరకు వెళ్లి తుపాకీ పెడ్తారు  కేసు వెనక్కి తీసుకొమ్మని బెదిరిస్తూ. చేసేదిలేక వెనక్కి తీసుకుంటారు. ఇలా నేరాల్లో,  బిజినెస్‌లో తమ వ్యూహాలతో అఖండానంద్‌ను ఆకట్టుకుంటారు అన్నదమ్ములు ఇద్దరూ. ఈ వ్యవహారం మున్నాకు కంటగింపుగా మారుతుంది. తన ముందే తండ్రి తనకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఆ అన్నదమ్ములకివ్వడంతో ఉడికిపోతుంటాడు. వాళ్లను సాగనంపే ప్రయత్నంలో ఉంటాడు. 

కాలేజీ ఎన్నికలొస్తాయి
మున్నా, గుల్లూ, బబ్లూ, వాళ్ల చెల్లితో పాటు ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూతుళ్లిద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. ఆ సీఐ.. అఖండానంద్‌ దగ్గర ముడుపులు తీసుకుంటూ ఆ గ్యాంగ్‌స్టర్‌ నేరాలను చూసీచూడనట్టు ఊరుకుంటుంటాడు. ఆయన పెద్ద కూతురిని మున్నా ఇష్టపడ్తుంటాడు. ఆ అమ్మాయేమో మున్నాను అసహ్యించుకుంటూ గుల్లూను ప్రేమిస్తుంటుంది. గుల్లూ వాళ్ల చెల్లి ఈ అక్కచెల్లెళ్లిద్దరికీ క్లోజ్‌ ఫ్రెండ్‌. సీఐ చిన్న కూతురు చదువులో కాలేజ్‌ టాపర్‌. బబ్లూకి ఆమె మీద గౌరవం పెరుగుతుంటుంది. కాలేజీ ఎన్నికల్లో మున్నా, సీఐ చిన్న కూతురు నిలబడ్తారు. మున్నా దాదాగిరి చేస్తూ అందరినీ విత్‌ డ్రా చేయిస్తుంటాడు. కానీ సీఐ కూతురి విషయంలో ఏమీ చేయలేకపోతాడు. సీఐ కూతురే ఎన్నికల్లో గెలుస్తుంది. ఆమెకు గుల్లూ, బబ్లూ సాయం చేశారని వాళ్ల మీద ఇంకా కక్ష పెంచుకుంటాడు. ఇంకోవైపు వ్యాపారపరంగానూ అతని తండ్రి వీళ్లకు పెద్ద పెద్ద టాస్కులు అప్పజెప్పుతూ వాళ్ల సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ఉండటంతో తండ్రి మీదా కసి పెరుగుతుంది. 

ఇక్కడి నుంచి ట్విస్టులు
కొడుకును కాదని బయటవాళ్లకు.. అదీ తన మీద దాడి చేసిన వాళ్లకు తమ సామ్రాజ్యంలో అంత స్థానం దొరకడం మున్నాలో పగను రగులుస్తుంటుంది. ఈ మాట ఒకసారి తండ్రితో కూడా అంటాడు. ‘‘పిచ్చివాడా.. యజమాని ఎప్పుడూ చేతికి రక్తం అంటించుకోవద్దు. ఇలాంటి కుక్కలను ఉపయోగించుకోవాలి. తుపాకీ ఉంది కదాని పేల్చకూడదు.. ఎవరి భుజం మీద పెట్టి పేల్చాలి.. ఎవరితో ఆ పని చేయించాలి అనే వ్యూహం మాత్రమే మనం పన్నాలి’’ అని బోధిస్తాడు. కాని ఈ లాజిక్‌ అతనికి అర్థం కాదు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ అయిన అనుచరుడితో తండ్రిని చంపే ప్లాన్‌ వేస్తాడు. బెడిసికొడ్తుంది. ఆర్‌ఎంపీ అనుచరుడు చనిపోతాడు.. తండ్రి బతుకుతాడు. తండ్రి తనను అనుమానిస్తున్నాడని గ్రహించిన వెంటనే దాన్ని గుల్లూ, బబ్లూ మీదకు మళ్లించేలా పథకం వేస్తాడు. కృతకృత్యుడవుతాడు. వాళ్ల పని తేల్చమని కొడుకుకే బాధ్యత ఇస్తాడు. అప్పటికే గుల్లూకి సీఐ కూతురుతో పెళ్లయిపోయి ఉంటుంది. తమ క్లాస్‌మేట్‌ నిఖా అవుతుంటే అందరూ కలిసి వెళ్తారు. 
గుల్లూ అండ్‌ టీమ్‌ కోసం గాలిస్తున్న మున్నా ఆ విషయం తెలిసి అతనూ అక్కడికి వెళ్తాడు తన గ్యాంగ్‌తో. తుపాకుల తూటాతో బీభత్సం సృష్టిస్తాడు. పెళ్లికొడుకు చనిపోతాడు. అంతా భయకంపితులవుతారు. గుల్లూ చెల్లి మీద తుపాకీ గురిపెట్టి.. గుల్లూ, బబ్లూ అండ్‌ టీమ్‌ కదలకుండా చేస్తాడు. తన దగ్గరున్న గన్‌తో అడ్డు రాబోయిన బబ్లూని చంపేస్తాడు. ఎదురుదాడి చేయబోయిన గుల్లూని కాలిస్తే భుజానికి గాయమై కిందపడ్తాడు. భర్తను రక్షించుకోవడానికి ముందుకెళ్లిన సీఐ పెద్ద కూతురి మీదా తూటా పేలుతుంది. పెళ్లి హాలంతా రక్తసిక్తం. ఈలోపు గుల్లూ ఇషారాతో సీఐ చిన్న కూతురు కిందపడ్డ తుపాకీ తీసుకుని గురి పెట్టి మున్నా ఏకాగ్రతను చెదరగొడ్తుంటే గుల్లూ లేచి మున్నా మీద కాల్పులు జరుపుతాడు. ఆ యుద్ధంలో గుల్లు, వాళ్ల చెల్లి, సీఐ చిన్న కూతురు మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. 

హిపోక్రసీకి ప్రతిబింబం
ఇక్కడితో తొమ్మిది ఎపిసోడ్ల మీర్జాపూర్‌ ఫస్ట్‌ సీజన్‌ అయిపోతుంది. జీవితాల్లోని ప్రాక్టికాలిటీని మాత్రమే చూపించిన సిరీస్‌ ఇది. వీల్‌చైర్‌కి అంకితమైన ముసలి వ్యక్తి జియోగ్రఫీ, యానిమల్‌ ప్లానెట్‌ చానల్స్‌ చూస్తూ నిస్సహాయురాలైన ఆ ఇంటి కోడలి మీద తన అగ్లీనెస్‌ను ప్రదర్శించడం, భర్తతో ఒక బిడ్డను కనాలనుకునే ఆ కోడలు భర్త చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆ ఇంటి వంటవాడి సమక్షంలో ఆదరణగా మలుచుకోవడం.. ఈ నిజాన్ని చూస్తున్న మామ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం.. హిపోక్రసీ సమాజానికి అద్దంపడ్తాయి. అయితే మీర్జాపూర్‌... అడల్ట్స్‌ ఓన్లీ!

– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement