సుమలత, అంబరీష్
డిసెంబరు 8న సుమలత–అంబరీష్‌ల పెళ్లి రోజు. ఈలోపే... ఊహించని విషాదం! జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఎవరినైనా పుట్టెడు దుఃఖం ఆవహిస్తుంది. సుమలత ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆమె దుఃఖాన్ని ఎవరూ పట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. సుమలత పుట్టినరోజు (ఆగస్ట్, 27) సందర్భంగా గతంలో సాక్షి ‘ఫ్యామిలీ’ చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను తిరిగి ప్రచురిస్తున్నాం.
► మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా! అంబరీష్‌లో మీ మనసును దోచుకున్నదేమిటి?
సుమలత: ఆయన మనస్తత్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికి బోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఆయన నన్ను ఇష్టపడ్డారు.
► తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలైపోయారు... జీవితం ఎలా ఉంది?
చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది.
► అంబరీష్‌గారు, మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది?
మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్‌కి బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు.
► ఆ స్నేహం వల్ల మీరెప్పుడూ ఇబ్బంది పడలేదా?
పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురి పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు.
► స్నేహితులకు సహాయం చేసే విషయంలో అంబరీష్‌గారిని మీరు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా?
లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం బోల్డన్ని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’.
► తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులున్నారనుకుంటా?
అవును. మోహన్‌బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్‌బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది.
► మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్‌గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో?
వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు అభిమానులు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది.
► అంబరీష్‌గారికి రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు?
(నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్‌గా ఉంటే ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అంబరీష్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి మోహన్‌బాబు, ఖుష్బూ, నరేశ్‌ల ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు’;
మంచి మనిషి, ఆప్త మిత్రుడు అంబరీష్. నిన్ను కోల్పోయాను. ఎప్పటికీ మిస్ అవుతుంటాను.
– రజనీకాంత్
చిరకాల మిత్రుడు అంబరీష్ ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తన మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. నటుడిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
– కృష్ణంరాజు
నా కెరీర్ తొలినాళ్లలో సంపాదించుకున్న స్నేహితుడివి నువ్వు. సంవత్సరాలు పెరిగే కొద్ది అది పెరిగి పెద్దదయింది. ఎంత రాసినా నువ్వు లేని లోటును వర్ణించలేనని తెలుసు. ‘బాస్’ అని నువ్వు పిలిచే పిలుపు మిస్ అవుతాను.
– మమ్ముట్టి
అంబరీష్‌గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన లేరంటే గుండె పగిలిపోతోంది. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలతతో పాటు కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలి.
– రాధికా శరత్‌కుమార్
మోహన్‌బాబు
కుమారుడు అభిషేక్, భర్త అంబరిష్‌లతో సుమలత
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment