రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ (ట్విటర్ ఫొటో)
బార్బీ.. అమ్మాయిల మనసు దోచుకునే ఓ బొమ్మ మాత్రమే కాదు.. అందం, ఆత్మవిశ్వాసాల కలయిక. బార్బీ కేవలం ఆడుకోవడానికే కాదు సరికొత్త పాఠాలు నేర్పేందుకు న్యూలుక్‌లో మార్కెట్‌లోకి వచ్చేసింది. వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించేందుకు ‘రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ’ని మంగళవారం లాంచ్ చేసినట్లు బొమ్మల తయారీ సంస్థ మటెల్ తెలిపింది. ఏడేళ్ల ప్రాయం నుంచే అమ్మాయిల్లో ఇంజనీరింగ్, కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించినట్లు పేర్కొంది. కిడ్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫాం ‘టింకర్’ భాగస్వామ్యం వల్లే రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించడం సాధ్యమైందని మటెల్ తెలిపింది.
సరికొత్త రూపంలో...
జీన్స్, గ్రాఫిక్ టీ- షర్ట్‌పై డెనిమ్ జాకెట్, కళ్లకు సేఫ్టీ గ్లాసెస్‌తో న్యూలుక్‌లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్స్ బార్బీలో ఆరు కోడింగ్ పాఠాలను చేర్చినట్లు ‘టింకర్’ సహ వ్యవస్థాపకుడు కృష్ణ వడాటి తెలిపారు. ఈ బార్బీతో ఆడుకుంటూనే.. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ బిల్డింగ్ బ్లాక్స్ వంటి కోడింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ 2017 గణాంకాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) తదితర రంగాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో ‘బార్బీ’తో జతకట్టడం ద్వారా చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్తరకం బార్బీతో ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లో కూడా గేమ్స్ ఆడటం వీలవుతుందని తెలిపారు.
బార్బీ నేపథ్యం...
పేపర్ బొమ్మలతో ఆడుకుంటున్న తన కూతురు బార్బరా కోసం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959లో ఒక సరికొత్త బొమ్మను రూపొందించారు. జర్మన్ డాల్ ‘బిల్డ్ లిల్లీ డాల్’ స్ఫూర్తితో రూపొందించిన బొమ్మకు తన కూతురి పేరు మీదుగా బార్బీ అని ఆమె నామకరణం చేశారు. బార్బీ పరంపరలో ఇప్పటి వరకు 200 మోడళ్లతో బార్బీ డాల్స్ అందుబాటులోకి వచ్చాయి. బార్బీ ప్రెసిడెంట్, బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్, బార్బీ పైలట్ వంటివి బార్బీ మోడళ్లలో ముఖ్యమైనవి.
Comments
Please login to add a commentAdd a comment